దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌ని 1-1తో సమం చేసుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీ చేయడం, బర్త్ డే బోయ్ కులదీప్ 5 వికెట్లు తీయడం ఒక విశేషమైతే… మరో ఆశ్చర్యకరమైన పరిణామం ఈ సందర్భంగా చోటు చేసుకొంది.
ఈ మ్యాచ్‌లో కొంత సమయం వరకూ డీ.ఆర్.ఎస్ పని చేయలేదు. ఎల్బీ, కాట్ బిహైండ్ నిర్ణయాల్ని మూడో ఎంపైర్కి నివేదించడమే డి.ఆర్.ఎస్ అనే సంగతి తెలిసిందే. భారత్ బ్యాటింగ్ సమయంలో డీ.ఆర్.ఎస్ అందుబాటులో ఉంది. భారత్ బౌలింగ్ కు దిగిన సమయంలో డీ.ఆర్.ఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాన్ని మళ్లీ పునరుద్ధరించేంత వరకూ డీ.ఆర్.ఎస్ అప్పీళ్లను ఫీల్డ్ లో ఉన్న ఎంపైర్లు స్వీకరించలేదు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో మిల్లర్ వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇవ్వడం, దాన్ని ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించడం జరిగిపోయాయి. మామూలుగా అయితే డీఆర్ఎస్కి వెళ్తే.. మిల్లర్ దొరికిపోయేవాడు. కానీ ఆ సమయానికి డీఆర్ఎస్ పని చేయలేదు. దాంతో.. మిల్లర్ బతికిపోయాడు. ఆ కాసేపటికి మళ్లీ డీఆర్ఎస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే.. డీఆర్ఎస్ మరోసారి వివాదాస్పదమయ్యేది. ఏదేమైనా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం క్రికెట్ కు మంచిది కాదు.