బాలీవుడ్లో రియా, బెంగళూరులో సంజన గల్రానీ అరెస్ట్ తర్వాత ఆయా సినీ రంగాలకు చెందిన వారి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వారికి డ్రగ్స్ సరఫరా దారులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని… పలువురు ప్రముఖ నటులకు డ్రగ్స్ సరఫరా చేశారని మీడియా ప్రచారం చేయడం ప్రారంభించింది. స్టార్లకు రేపోమాపో నోటీసులిస్తారని కూడా అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌కి చెందిన 25 మంది ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్నట్లు మీడియా ప్రకటించేసింది. అయితే.. అది తన సొంతంగా కాకుండా.. విచారణలో రియా చెప్పిందంటూ కవర్ చేసుకుంటోంది.
బాలీవుడ్ ప్రముఖులకు త్వరలో నోటీసులు పంపి.. ముంబై ఎన్సీబీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తొలి దశలో పది మంది ప్రముఖులకు నోటీసులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తించిన ఎన్సీబీ వారిని మూడు గ్రూపులుగా విభజించిందని.. తక్కువగా డ్రగ్స్ వాడిన వారిని సీ కేటగిరిగా, కాస్త ఎక్కువగా వాడే వారిని బీ కేటగిరిగా.. బాగా డ్రగ్స్ వాడిన వారిని ఏ గ్రూప్‌గా పరిగణిస్తున్నారని ఇంగ్లిష్ మీడియా చెబుతోంది. వారు ఎవరి ద్వారా డ్రగ్స్ పొందారో తెలుసుకుంటారని చెబుతున్నారు.
ఇక బెంగళూరులోనూ.. సంజన గల్రానీ, రాగిణి ద్వివేదీల అరెస్ట్ తర్వాత.. అదే తరహా ప్రచారం జరుగుతోంది. వారి ఇళ్లలో సోదాలు చేసి .. స్వాధీనం చేసుకున్న సమాచారంలో ప్రముఖుల పేర్లు ఉన్నాయని.. వారికి త్వరలో నోటీసులు వెళ్తాయని మీడియాకు లీకులు ఇస్తున్నారు. మీడియా దాన్ని బ్రేకింగ్ న్యూస్‌ల రూపంలో హడావుడి చేస్తోంది. దీంతో.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా… ఆ నటీమణులతో సన్నిహితంగా ఉన్న వారి గుండెల్లో రాయి పడుతోంది. ఎక్కడ తమ పేరు టీవీ బ్రేకింగ్న్యూస్లకు ఎక్కుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.
నిజానికి బాలీవుడ్లో.. శాండల్‌వుడ్‌లో ఇప్పుడు ఈ సీన్లు జరుగుతున్నాయి కానీ.. టాలీవుడ్లో ఎప్పుడో జరిగాయి. రవితే దగ్గర్నుంచి తరుణ్ వరకూ అందర్నీ పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. కానీ ఆ కేసులేమయ్యాయో ఎవరికీ తెలియదు. బాలీవుడ్.. శాండల్ వుడ్ స్టోరీలు కూడా అంతే అవుతాయి. మహా అయితే.. ఒకరిద్దరు చిన్న వాళ్లని బకరాలను చేస్తారు అంతే..! ఇప్పటి వరకూ జరిగింది ఇదే..!