హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు. ఇటీవల టోనీ అనే మోస్ట్ వాంటెడ్‌ను సీవీ ఆనంద్ పట్టుకొచ్చారు. దాంతో చాలా మంది జాతకాలు బయటకు వచ్చాయి. బడా స్మగ్లర్ టోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తరవాత బయటపడిన విషయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి.
సమాజంలో పలుకుబడి ఉండి.. వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వారు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా తేలింది. వీరందర్నీ అరెస్ట్ చేసి జైలుకు తరలిచారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ సమస్య ఊహించినంత చిన్నదేం కాదని.. పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కేసులోఇంకా పలువురు వీఐపీలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో సీఎం కేసీఆర్ డీజీపీ, హైదరాబాద్ సీపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డ్రగ్స్ తీసుకున్న వారు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు.
మరింత కట్టడి చేసేందుకు ఈ నెల 28 వ తేదీన ప్రగతి భవన్లో డ్రగ్స్ నియంత్రణపై పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలను డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. వెయ్యి మందితో నార్కోటిక్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో డ్రగ్స్ మాటే వినిపించకూడాదన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.