ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఏపీ నుంచి గంజాయి వస్తున్న బాధిత రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. తమ రాష్ట్ర యువత నిర్వీర్యం అయిపోతోందన్న ఆందోళనతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సమయంలో గంజాయి వంటి మాదకద్రవ్యాల సాగు, వినియోగం పెరగడం మంచిది కాదని.. ఈ సమస్యను తొలగించుకోవాలంటే గంజాయి సాగు, వినియోగం, స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఉన్నాధికారుల్ని ఆదేశించారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని .. తక్షణం పోలీస్, ఎక్సైజ్ శాఖ తీవ్రంగా పరిగణించాలి. గంజాయి అక్రమ సాగు, వినియోగాన్ని అంతం చేసేందుకు డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి, ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
డ్రగ్స్ మాఫియాను అణిచివేయాలని, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించవలసిన అవసరం లేదన్నారు. ఎన్ ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేయాలన్నారు. సరిహద్దుల్లో ప్రత్యేకమైన నిఘా పెట్టాలని స్పష్టం చేశారు.