ఆప్ఘనిస్థాన్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీ టాల్కమ్ పౌడర్ దిగుమతి చేసుకుంది. ఈ కంటెయిన్ వచ్చిన తర్వాత అధికారులు పరిశీలన జరిపితే అది టాల్కమ్ పౌడర్ కాదు.. హెరాయిన్ అని తేలింది. ఆ హెరాయిన్ విలువ రూ. వంద..రెండు వందల కోట్లు కాదు. ఏకంగా రూ. తొమ్మిది వేల కోట్లు. ఈ హెరాయిన్ పరిమాణాన్ని చూసి డీఆర్ఐ అధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఆషీ ట్రేడింగ్ పేరుతో విజయవాడ కంపెనీ ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటోంది.
ఊరూపేరూ లేనికంపెనీ ఆషి ట్రేడింగ్ అని తేలింది. అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి వ్యాపారాలు చేయని సంస్థ. గత ఏడాదే దాన్ని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బినామీలు.. తప్పుడు పేర్లు పెట్టి కంపెనీని పెట్టిన దుండగులు ఈ డ్రగ్స్‌ను విజయవాడ కేంద్రంగా దిగుమతి చేసుకుని వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడను ఎందుకు సేఫ్‌జోన్‌గా ఎంచుకున్నారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
ఆప్ఘనిస్థాన్‌లో డ్రగ్స్ బిజినెస్ మొత్తం తాలిబన్ల చేతుల్లోనే ఉంటుంది. వారితోనే విజయవాడకు చెందిన గ్యాంగ్ డీల్స్ చేసుకుని ఇలా వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను దేశంలోకి దిగుమతి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాంటే ఇప్పటి వరకూ ఎంత ఇలా దేశంలోకి డ్రగ్స్‌ను డంప్ చేసి ఉంటారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆ విజయవాడ గ్యాంగ్‌ను పట్టుకుంటేనే కానీ ఈ రహస్యం బయటకు రాదు. నేరుగా తాలిబన్లతోనే డీల్ చేస్తున్నారంటే అతి సామాన్య మైన విషయం కాదని భావిస్తున్నారు.