మలయాళంలో వచ్చిన దృశ్యమ్ ఓ మాస్టర్ పీస్. జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే బ్రిలియన్స్‌కి ఇదో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏ క్రైమ్ స్టోరీలో అయినా సరే, హంతకుడు ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురు చూస్తుంటారు. ఈ కథలో మాత్రం హంతకుడు దొరక్కపోతే బాగుణ్ణు అనుకుంటుంటారు. అదే… దృశ్యమ్ లో స్పెషాలిటీ. ఎన్ని భాషల్లో ఈ సినిమా తీసినా, హిట్టవ్వడానికి కారణం.. అదే. సాధారణంగా.. ఓ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తే – అదే స్థాయిలో విజయం సాధించడం చాలా కష్టం. కానీ `దృశ్యమ్ 2` ఆ లోటు కూడా తీర్చేసింది. దృశ్యమ్ లానే.. దృశ్యమ్ 2 కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఇదే కథని తెలుగులో మళ్లీ రీమేక్ చేశారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాంబాబు మళ్లీ వచ్చాడు. మరి ఈ సారి.. ఏం జరిగింది? రాంబాబు సినిమా తెలివితేటలు ఎంత వరకూ ఉపయోగపడ్డాయి..?
కథలోకి వెళ్దాం.. ఆరేళ్ల క్రితం రాంబాబు జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. తన కూతురిపై కన్నేసి,. తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చిర వరుణ్ ని రాంబాబు (వెంకటేష్) చంపేశాడు. ఆ శవాన్ని కొత్తగా కడుతున్న పోలీస్ స్టేషన్లోనే పాతేశాడు. పోలీసులకు ఈ హత్య రాంబాబే చేశాడని తెలుసు. కానీ ఒక్క సాక్ష్యం కూడా లేదు. కనీసం శవం కూడా దొరకలేదు. శవం దొరికితే… దాన్ని బట్టి క్లూలను మళ్లీ రాబట్టొచ్చు. రాంబాబుని మళ్లీ ఈ కేసులో ఇరికించొచ్చు. అందుకోసం పోలీసులు మళ్లీ రంగంలోకి దిగుతారు. మఫ్టీలో.. రాంబాబుపై, అతని కుటుంబంపై ఓ కన్నేసి ఉంచుతారు. ఆరేళ్ల క్రితం సమాధి అయిన ఓ నిజం.. ఈసారి బయటకు వచ్చిందా? చేదు జ్ఞాపకాల్ని మర్చిపోయి, తన కుటుంబంతో, సరదాగా గడిపేస్తున్న రాంబాబు జీవితంలోకి ఎలాంటి కుదుపు వచ్చింది? ఈసారి ఎలా తప్పించుకున్నాడు? అనేదే మిగిలిన కథ.
ఆరేళ్ల క్రితం క్లోజ్ అయిన ఓ కేసుని పోలీసులు మళ్లీ తవ్వితే.. ఎలా ఉంటుందన్న ఆలోచనతో దృశ్యమ్ 2కి అంకురార్పణ జరిగి ఉంటుంది. నిజానికి ఇలాంటి కథకు సీక్వెల్ తీయడం చాలా కష్టం. దృశ్యమ్ లో ఉన్న మలుపులు, ఆసక్తి.. సీక్వెల్ లో కొనసాగించడం కూడా కష్టమే. కానీ జీతూ సోసెఫ్ ఆ సాహసం చేశాడు. పోలీసుల కంటే అన్ని విషయాల్లోనూ ముందే ఉండడం రాంబాబు స్పెషాలిటీ. అదే.. దృశ్యం 1లో తనని, తన కుటుంబాన్నీ కాపాడింది. సరిగ్గా అదే తెలివి తేటలు దృశ్యమ్ 2లో వాడేశాడు జోసెఫ్.
వరుణ్ శవం ఎక్కడుంది? అనేది అందరికీ తెలిసిన విషయమే. అది పోలీసులకు మాత్రమే తెలీదు. దాన్ని పోలీసులు ఎలా ఛేదించారు? అనేది ఆసక్తికరమైన విషయం. అలా.. పోలీసులకు శవం ఆచూకీ దొరికాక… రాంబాబే ఈ హత్య చేశాడని తెలిశాక ఆ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? అనేది మరో కీలకమైన అంశం. దృశ్యం 2…కి అతి ముఖ్యమైన ఎపిసోడ్స్ ఇవి. ఇవి రెండూ జీతూ జోసెఫ్ బాగా డీల్ చేశాడు. దాదాపుగా 150 నిమిషాల కథ ఇది. తొలి వంద నిమిషాలూ… సో..సోగానే సాగుతుంది. హత్య చేసిన తాలుకూ భయం రాంబాబు కుటుంబ సభ్యుల్ని వెంటాడడం తప్ప.. ఆ వంద నిమిషాల్లో ఏదీ జరగదు. రాంబాబూ… ఓ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకోసం తరచూ విశాఖపట్నం వెళ్లొస్తున్నాడన్నది మాత్రం చెప్పారు. ఆ విషయం చెప్పడానికి అన్ని సీన్లు ఎందుకు తీనేశారు? అనే అనుమానం వేస్తుంటుంది. కథలో వేగం లేకపోవడంతో.. దృశ్యమ్ పై పెంచుకున్న అంచనాలు పటాపంచలుఅవుతున్నట్టు అనిపిస్తాయి. అయితే.. తొలి సగంలో చేసిన లాగ్ కి .. ద్వితీయార్థంలో న్యాయం చేసేశాడు దర్శకుడు. రాంబాబు సినిమా తీయాలనుకున్న కథని.. తెలివిగా వాడుకున్నాడు. ఓహో.. ఫస్టాఫ్‌లో అందుకా.. ఇంత లాగ్ తీసుకున్నది.. అనిపించేలా చేశాడు. చివర్లో వచ్చే రెండు ట్విస్టులే ఈ కథకు ప్రాణం. అవి కచ్చితంగా షాక్ ఇస్తాయి. కాకపోతే.. ఆ ట్విస్టులు చూడడానికి వంద నిమిషాల పాటు ఈ కథని, సన్నివేశాల సాగదీతని భరించాలి.
ఓ నేరం వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. కానీ బాధిత కుటుంబం ఒకటి ఉంటుంది. `నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి` అని రాంబాబు బలంగా నమ్మినప్పుడు అదెంత నిజమని, అదే నిజమని ఎలా అనుకుంటారో.. వరుణ్ చావుకి కారణం తెలుసుకోవాలని తల్లిదండ్రులు పట్టుబట్టినప్పుడు కూడా అటు వైపు కూడా న్యాయం ఉందనిపిస్తుంది. దృశ్యమ్ హిట్టవ్వడానికి అదే బలమైన ఎమోషన్ థ్రెడ్ గా నిలిచింది. ఈ సీక్వెల్ కి కూడా అదే ప్రాణమైంది. పోలీసులకంటే ఓ అడుగు ముందే ఆలోచించడం రాంబాబు బలం. ఇక్కడా అదే కనిపించింది. దృశ్యమ్ 2 మాత్రమే కాదు… 4, 5, 6… ఇలా ఎన్నొచ్చినా, రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఉంటాడు.. అనేంత నమ్మకం ఆ క్యారెక్టరైజేషన్ తో కలిగించాడు దర్శకుడు.. సో. దృశ్యమ్ 3 వచ్చినా, అక్కడ క్లైమాక్స్ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఇప్పుడే ఊహించగలరు.
ఓ సాధారణ వ్యక్తిగా, తన కుటుంబం కోసం ఏమైనా చేయగలిగే తండ్రిగా వెంకటేష్ మరోసారి పరకాయ ప్రవేశం చేశాడు. తను చాలా ఈజీగా చేసేసిన పాత్రల్లో ఇదొకటి. మలయాళంలో నటించిన మోహన్ లాల్‌తో పోల్చలేం గానీ, వెంకీ తనదైన మార్క్ మాత్రం వేయగలిగాడు. మీనా ఎప్పటిలానే పద్ధతిగా నటించింది. తొలి పార్ట్ తో పోలిస్తే.. ఈ పార్ట్ లో పిల్లల భాగస్వామ్యం చాలా తక్కువ. నదియా, నరేష్‌ల పాత్రలూ అంతే. ఇది క్యారెక్టర్స్ బేస్ కథ కాదు. కథే.. పాత్రల్ని నడిపిస్తుంది కాబట్టి.. ప్రతీ పాత్రా కీలకంగానే కనిపించింది.
జీతూ సోసెఫ్ స్క్రీన్ ప్లే.. ఈ సినిమాకి బలం. ముఖ్యంగా చివరి 45 నిమిషాలూ.. కథలో మలుపులు ఆకట్టుకుంటాయి.కాకపోతే.. అంతకు ముందు నడిచినకథని.. కాస్త ఓపిగ్గా భరించాలి. ఆట ఆడాలంటే సరైన గ్రౌండ్ కూడా చాలా ముఖ్యం. అలాంటి గ్రౌండ్ తయారు చేయడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్న మాట వాస్తవం. కానీ.. ఆట మాత్రం బాగానే ఆడాడు. ఓటీటీనా? థియేటరా? అనే సందిగ్థం నిర్మాతలకు గట్టిగా నెలకొంది. ఏది ఓటీటీ సినిమానో, ఏది థియేటరికల్ సినిమానో తేల్చుకోవడం కష్టం అవుతోంది. కొన్ని సినిమాలు ఓటీటీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంటాయి. దృశ్యమ్ 2 అలాంటి సినిమానే. థియేటరికల్ రిలీజ్ అయితే… ఓపిగ్గా చూడడం కష్టం అయ్యేది. ఓటీటీ కాబట్టి.. తొలి వంద నిమిషాలూ.. ఫాస్ట్ ఫార్వెడ్ ని నమ్ముకుంటే.. చివరి 45 నిమిషాలూ.. కావల్సినంత థ్రిల్ అందిస్తుంది.