సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి చాలా కళలున్నాయి. స్వరాలు సమకూరుస్తూనే, తన చేత్తో స్వయంగా చాలా పాటలు రాసేశాడు. తను మంచి గాయకుడు కూడా. తనలోని డాన్సింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవిశ్రీకి నటనపై కూడా మోజు. తను హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. సుకుమార్ కథ, దిల్‌రాజు నిర్మాణం అంటూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేం ఓ కొలిక్కి రాలేదు. అయితే ఆ కోరిక క్రమంగా మరుగున పడిపోయినట్టుంది. హీరోగా ఎప్పుడు అంటే.. నిర్లిప్తంగా సమాధానం చెప్పుకొచ్చాడు. తన దృష్టంతా సంగీతంపైనే ఉందని, నటనపై ధ్యాస పోవడం లేదని తేల్చేశాడు. అయితే తమిళం నుంచి మాత్రం కొన్ని ఆఫర్లు వచ్చాయట. కానీ అవేమీ అంత గొప్ప కథలు కావంటున్నాడు. దేవిశ్రీ హీరోగా చేయాలంటే రెండు షరతులున్నాయి. ఒకటి.. `ఈ కథ వదులుకోకూడదు` అని దేవిశ్రీకి అనిపించాలట. అంతేకాదు… ఆ కథ సంగీత నేపథ్యంలో సాగాలట. ఇవి రెండూ కుదిరితే దేవిశ్రీ హీరో అయిపోతాడు. అయితే ఈ కండీషన్లు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో దేవిశ్రీ చెబుతూ వస్తున్నవే. కానీ ఇప్పటి వరకూ అలాంటి కథేం రాలేదు. పైగా దేవిశ్రీ హీరోయిజం చూపించే వయసు కూడా దాటిపోతోంది. అందుకే… అటువైపు మనసు మళ్లడం లేదేమో…?