శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టిక్కెట్లు ఇచ్చేందుకు తిరుపతిలో గతంలో ఎప్పుడూ చేయనంత ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎనిమిది చోట్ల టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏడు చోట్ల బారీకేడ్లు పెట్టారు. అంతా ప్రశాంతంగా జరిగిపోయేలా చేశారు. ఎనిమదో చోట మాత్రం.. బారీకేడ్లు అవసరం లేదని అక్కడి డీఎస్పీ నిర్లక్ష్యం చేశారు. టీటీడీ అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. తాము చూసుకుంటామన్నారు. అక్కడే తొక్కిసలాట జరిగింది.
బైరాగి పట్టెడ టోకెన్ జారీ కేంద్రం వద్ద డీఎస్పీ రమణకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. మిగతా అన్ని చోట్ల లాగానే బారీకేడ్లు, ఇతర ఏర్పాట్లు చేద్దామని టీటీడీ అధికారులు చెబితే ఆయన నిర్లక్ష్యం వహించారు. తొక్కిసలాట జరిగిన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమయంలో అందర్నీ కంట్రోల్లో ఉంచాల్సిన ఆయన… గేట్లు తీశారు. దీంతో టిక్కెట్లు ఇవ్వడానికే తెరిచారు అనుకుని అందరూ దూసుకొచ్చేశారు. ఫలితంగా మరణాలు పెరిగాయి. ఒక్క డీఎస్పీ అనాలోచితం కారణంగానే ఈ మొత్తం ఘటన జరిగిందని స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఓ అంబులెన్స్‌ను తీసుకొచ్చి అడ్డంగా పెట్టి డ్రైవర్ వెళ్లిపోయాడు.దాంతో భక్తులు అటూ ఇటూ కదలడానికి అవకాశం లేకుండాపోయింది.
అయితే ఇందులో కుట్ర ఉందని అనుకోవడం లేదని.. ప్రమాదవశాత్తూనే జరిగిందని ఎవర్నీ నిందించలేమని టీటీడీ అధికారులు అంటున్నారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు ఆ.. ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఆ డీఎస్పీ వ్యవహారంపై ఎస్పీకి వెంటనే ఫిర్యాదు చేశారు. ఎస్పీకి సిబ్బందితో వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.