తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీఎస్పీ ప్రణీత్ రావును.. పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకుని.. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆయనపై అత్యంత తీవ్రమైన అభియోగాలతో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. దీంతో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ప్రణీత్ రావు .. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఓ టీముని ఏర్పాటు చేసుకుని .. అధికారికంగా ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబీ కార్యాలయంలోనే ఈ వ్యవహారం సాగించారని భావిస్తున్నారు. కాంగ్రెస్ గెలిచిన రోజునే.. తన కార్యాలయంలోని డాటాను మొత్తం ఎరేజ్ చేశారు. తన సొంత డిస్కుల్లోకి కాపీ చేసుకున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎవరెవరిపై నిఘా పెట్టారన్నదానిపై అనేక ఆధారాలు ఉండటంతో.. వెంటనే.. ఆయనను అదుపులోకి తీసుకుని ఇతర అంశాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత్ రావు విచారణలో ఏం చెబుతారన్నది పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారుల్ని వెలుగులోకి తేవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
జ్వరం వల్ల కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం
కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు . కేటీఆర్ కు ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని ఆయన డాక్టర్ తెలిపారు. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన కేటీఆర్, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలియజేశారు.