ఒక భారతీయ మహిళ హత్య కేసులో దుబాయ్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి విన్నట్లయితే, అటువంటి కేసులలో మన దేశంలో మహిళలకు అసలు న్యాయం జరుగుతోందా? అనే అనుమానం కలుగుతుంది.
కేరళ రాష్ట్రానికి చెందిన నిమ్మీ ధనంజయన్, అతిఫ్ పొపరె ప్రేమించి 2008లో పెళ్లిచేసుకొన్నారు. అతని కోసం ఆమె తన మతాన్ని పేరుని కూడా మార్చుకొంది. ఆమె తన పేరును బుష్రాగా మార్చుకొంది. వారిరువురు ఉద్యోగరీత్యా దుబాయి వెళ్ళిపోయారు. అక్కడ వారికి ఒక పాప కలిగింది. దుబాయి వెళ్ళిన తరువాత అతిఫ్ అక్కడ ఒక మహిళతో అక్రమసంబంధం పెట్టుకొన్నాడు. ఆ కారణంగా బుష్రా, అతీఫ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండేళ్ళ క్రితం మార్చిలో 24న, అతీఫ్ తన భార్య బుష్రాను హత్య చేశాడు. దుబాయ్ న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. గల్ఫ్ దేశాలలో చట్టాల ప్రకారం మరణశిక్షపడిన వారిని ఈ భూమ్మీద ఒకే ఒకరు కాపాడగల శక్తి ఉంటుంది. ఆ నేరస్థుడి వలన నష్టపోయిన వ్యక్తి కుటుంబం. ఒకవేళ భాదిత కుటుంబం అతనిని క్షమిస్తే అతని మరణ శిక్ష రద్దవుతుంది. లేకుంటే ఇక ఆ వ్యక్తిని ఆ దేశ రాజుగారు కూడా కాపాడలేరు. తన ప్రియాతి ప్రియమయిన కుమార్తెని దారుణంగా హత్య చేసిన అతీఫ్ ని క్షమించబోనని బుష్రా తల్లి ఉషా ధనంజయన్ దుబాయి కోర్టుకి తెలియజేసారు. అంటే ఇక అతీఫ్ మరణశిక్షని ఇక ఎవరూ ఆపలేరని స్పష్టమయింది.
అదే నిర్భయ కేసులో అతికిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయిన నిందితులని తక్షణమే ఉరి తీయమని గత మూడేళ్ళుగా ఆమె తల్లి తండ్రులతో సహా దేశ ప్రజలు అందరూ కోరుకొంటున్నా ఇంతవరకు వారికి శిక్షలు అమలు చేయలేదు. పైగా వారిలో అందరికంటే అతి క్రూరంగా ప్రవర్తించిన బాలనేరస్తుడిని ఇటీవలే విడుదల చేసారు కూడా. నిర్భయ కేసులో దోషులెవరో న్యాయస్థానాలు సరిగ్గానే గుర్తించి వారికి శిక్షలు ఖరారు చేసాయి. కానీ నేటికీ ఆ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. బాలనేరస్తుడిని విడుదలవుతున్నప్పుడు, అతని వలన సమాజానికి ప్రమాదం ఉంటుందని కనుక అతనిని కనీసం కొంత కాలం నిర్బంధించి ఉంచాలని నిర్భయ తల్లితండ్రులు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు మొరపెట్టుకొన్నప్పుడు చట్టాలు తమ చేతులను కట్టి వేశాయని డిల్లీ హైకోర్టు చెప్పి తన నిస్సహాయతను చాటుకొంది.
ఇంకా విచారకరమయిన విషయం ఏమిటంటే బాలనేరస్తుడి విడుదలని వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లితండ్రులు, డిల్లీ ప్రజలు కలిసి డిల్లీలో చేసిన నిరసన దీక్షలో ఇంచుమించు అటువంటి కిరాతానికే బలయిన మరో నిర్భయ తల్లి తండ్రులు కూడా ఆ దీక్షలో పాల్గొని నిర్భయ కేసులోనే న్యాయం జరగనప్పుడు తమ కుమార్తెకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
దుబాయ్ న్యాయస్థానం ఒక నేరస్తుడికి మరణశిక్ష విదిస్తే అతనిని ఆ దేశ రాజుగారు కూడా కాపాడలేరు. కానీ హేయమయిన నేరం చేసిన బాలనేరస్తుడు విడుదలవుతుంటే భారత న్యాయస్థానం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఈ రెండు కేసులలో భారత్-దుబాయ్ చట్టాలు, న్యాయస్థానాలు వ్యవహరించిన తీరును గమనిస్తే వాటి మధ్య ఎంత తేడా ఉందో అర్ధమవుతుంది. గల్ఫ్ దేశాలలోగా మరణశిక్షలు విదించవలసిన అవసరం లేదు. కనీసం బాధితులకు న్యాయం చేయగలిగితే చాలని కోరుకోవడం తప్పేమీ కాదు.