తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నంతా దుబ్బాకలో బీజేపీ వర్సెస్ పోలీస్ అన్నట్లుగా సాగింది. విషయం అమిత్ షా వరకూ వెళ్లింది. బండి సంజయ్ పై పోలీసులు దాడి చేయడంతో .. అమిత్ షా నేరుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చేశారు. ఆ తర్వాత హుటాహుటిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. సిద్దిపేట వెళ్లారు. ఈ వరుస పరిణామాల హైటెన్షన్… మంగళవారం కూడా కొనసాగనుంది. ప్రస్తుతం ముఖ్య నేతలంతా సిద్దిపేటలోనే ఉన్నారు. బీజేపీ తన పార్టీ కార్యాకర్తలందర్నీ సిద్దిపేట తరలి రావాలని పిలుపునిచ్చింది.
దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గురి మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఉంది. నామినేషన్లు ప్రారంభమైన సమయంలోనే హైదరాబాద్ శివార్లలో రూ. 40 లక్షలు పట్టుకున్నారు. ఆ సొమ్ము రఘునందన్ రావుదేనని.. ఎన్నికల్లో పంచడానికి తీసుకెళ్తున్నారని పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత రఘునందన్ రావు.. తనతో పాటు.. తన సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా.. సిద్దిపేటలోని రఘునందన్ రావు బంధువులకు చెందిన ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఇద్దరు ఇళ్లలో సోదాలు చేశారు. అందులో ఒకరు రఘునందన్ రావు మామ. ఆయన ఇంట్లో డబ్బులేమీ దొరకలేదు. కానీ.. మరో వ్యక్తి ఇంట్లో కూడా సోదాలు చేశారు. అక్కడ రూ. పదహారు లక్షలు దొరికినట్లుగా పోలీసులు ప్రకటించారు.
అయితే అక్కడ దొరికిన సొమ్మును తీసుకుని పోలీసులు రఘునందన్ రావు మామ ఇంటికి వచ్చారు. వేరే చోట దొరికిన సొమ్మును పోలీసులు రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికినవని చూపించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు అప్పుడే గుప్పుమన్నాయి. పోలీసులు కూడా డబ్బును ఇంట్లోకి తీసుకు వస్తూ.. కంగారుపడుతూ కనిపించారు. ఈ వీడియోలు హల్ చల్ చేశాయి. తప్పు చేశారు కాబట్టే్ పోలీసులు కంగారు పడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు .. వారి వద్ద ఉన్న నగదును లాక్కునేందుకు ప్రయత్నించారు. రూ. పన్నెండు లక్షలు లాక్కున్నారని పోలీసులు ప్రకటించారు. ఈ గొడవ జరుగుతునన సమయంలోనే… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను సిద్దిపేటలో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. ఆయనపై భౌతిక దాడి చేశారు. ఆయన చేతికి గాయం అయింది. ఈ గాయం బాధ ఓర్చుకోలేక ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నారు.
బండి సంజయ్ పై దాడి విషయం తెలిసిన తర్వాత కేంద్రమమంత్రి అమిత్ షా… ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. సిద్దిపేట చేరుకున్నారు. ఈ రగడ జరిగిన తర్వాత పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. డబ్బు దొరికింది.. రఘునందన్ రావు బంధువుల ఇంట్లోనేనని.. ఎన్నికల్లో పంచడానికే తెచ్చానని .. ఆయన ఒప్పుకున్నారని కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం.. దిగజారిపోయారని..బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హరీష్ రావుకు అధికారయంత్రాంగంపై సంపూర్ణమైన పట్టు ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ఎన్నికల్లో గెలుద్దామని అనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
సాధారణగా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు కేక్ వాక్లా ఉంటుంది. ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా పని చేసుకెళ్లిపోతుంది. దుబ్బాకలో అదీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన చోట వచ్చిన ఉపఎన్నికల విషయంలో జరుగుతున్న రగడ… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే.. ఇలా బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి.. బాగా ప్రచారం వచ్చేలా చేయడం కూడా.. హరీష్ వ్యూహమేనని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్ని ఎక్కువ ఓట్లు చీలితే తమకు అంత మంచిదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు మొత్తానికి దుబ్బాక రాజకీయం మాత్రం… ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతోంది.