తెలంగాణ రాష్ట్రం సరైన అనుమతులు లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించేస్తూ పోతున్నదనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఈ విషయంలో చంద్రబాబు సర్కారు ఏం చేస్తున్నది? టీ ప్రాజెక్టుల వల్ల ఏపీ నీటి లభ్యత పరంగా దారుణంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ , చంద్రబాబు సర్కారు ఎందుకు పట్టించుకోలేదు.. వంటి ప్రశ్నలు అందరి మదిలోనూ ఉన్నాయి. కానీ.. ఏదో లేఖలు రాశాం.. లాంటి పడికట్టు మాటలు తప్ప సర్కారు సీరియస్గా పట్టించుకున్నది లేదు. రఘువీరా దీక్ష చేసినప్పుడు కూడా వారు పట్టించుకోలేదు. కానీ జగన్ దీక్షకు ఉద్యమిస్తున్నాడనగానే.. ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చింది. సోమవారం నాడు చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశమైన ఏపీ కేబినెట్.. టీ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం గురించి తీవ్రంగా చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా ఈ క్రెడిట్ జగన్కు దక్కుతుందనే చెప్పాలి.
చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశమైన ఏపీ కేబినెట్ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అనేక అంశాలను చర్చించింది. ఇందులో తెలంగాణలో నిర్మిస్తున్న అనుమతుల్లేని ప్రాజెక్టుల ప్రస్తావన కూడా ఉంది. జగన్ ఒకవైపు మూడురోజుల నిరశన దీక్షకు ఉపక్రమిస్తూ ఉండగా, ప్రభుత్వం ఈ విషయంలో బెల్లం కొట్టిన రాయిలాగా అచేతనంగా ఉన్నదనే ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్లకుండా.. ఆయన దీక్ష తేదీ కంటే ముందే ప్రభుత్వ పరంగా ఏదైనా చర్య తీసుకోవాలని కేబినెట్ చర్చించినట్లుగా తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలతో ఓ సమావేశం ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరడానికి కేబినెట్ నిర్ణయించింది.
దీనితో పాటూ అనేక కీలక నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకున్నది. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. సీఆర్డీయే పరిధిలో పనులు పర్యవేక్షణకు కమిటీలను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భోగాపురం ఎయిర్పోర్టుకు 800 కోట్లు ఇవ్వాలని తీర్మానించారు. ఇంకా అనేక నిర్ణయాలను కేబినెట్ తీసుకున్నది.
మొత్తానికి తెలంగాణ సర్కారు అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. ఆచరణలో వెనుకంజ వేయకుండా బాబు సర్కార్ పోరాడితేనే ఏపీ కి న్యాయం జరుగుతుంది.