నంద్యాల ఓటమి తర్వాత వైఎస్ఆర్సిపిలో కొంత కలకలం రేగిందనేది కాదనలేని సత్యం. అయితే అధినేత జగన్ విధేయులైన వారు మరింత తీవ్రంగా భజన చేస్తూ ఆయన ఆసలు ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. జగన్ ఔన్నత్యం ఏమిటో ఆబ్జెక్టివ్ తరహాలో వివరిస్తూ ఎంఎల్ఎ రోజా ఫేస్బుక్లో చేసిన పోస్టింగు ఇందుకో ఉదాహరణ మాత్రమే. అయితే మీడియాలో మాత్రం జగన్ రాజకీయంగా ఎదురు దెబ్బ తిన్నారన్న భావమే వ్యక్తమవుతున్నది. పైగా ఉప ఎన్నిక ప్రారంభంలో సానుకూలంగా వున్న వాతావరణాన్ని చేజేతులా చెడుగొట్టుకున్నారన్న భావన ఆ పార్టీలోనే వుంది. స్వతహాగా బలమైన అభ్యర్థిగా వున్న శిల్పా మోహన రెడ్డిని తన మానాన తనను వదలిపెట్టినా ఇంతకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునే వారని, ఆద్యంతం తన వెంటే తిప్పుకోవడం ద్వారా ఆ అవకాశం కూడా లేకుండా చేశారని వారు వాపోతున్నారు.
అదలా వుంచితే ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం నాడు జగన్కు ఎదురుదెబ్బ అంటూ ప్రత్యేకంగా సంపాదకీయం రాసింది. గతంలో వచ్చిన ఓటింగును కూడా గణనీయంగా పోగొట్టుకున్న జగన్ క్రమేణా వెనక్కు పోతున్నారని ఆ పత్రిక పేర్కొంది. నంద్యాలలోనూ తన మాటల ద్వారా ఆయనే నష్టం కలిగించుకున్నారని కూడా స్పష్టం చేసింది. ఈ దూకుడు గనక సలహాదారు ప్రశాంత కిశోర్ వ్యూహమే అయితే తక్షణం వదులు కోవాలని సలహా ఇచ్చింది. జగన్ అత్యాశాపరుడనీ, దుందుడుకు స్వభావి అని ప్రజలలో వున్న అభిప్రాయాన్ని మరింత బలపరచేలా వ్యవహరించవద్దని సూచించింది. మన బలహీనతలే బలం అనుకుంటే పొరబాటవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ సంపాదకీయం ప్రశంసలు కురిపించింది. మొదట తప్పుగా మాట్లాడినా ఆయన శైలి మార్చుకుని అభివృద్ధి, వాగ్దానాలపై కేంద్రీకరించారని వ్యాఖ్యానించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన ఈ సంపదకీయాన్ని దగ్గర పెట్టుకుని చూస్తే రోజా పేరిట వచ్చిన పోస్గింటు సమాధానంలా అనిపిస్తుంది.