దుగ్గిరాల ఎంపీపీని ఎలాగైనా గెల్చుకోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో గురువారం తేలిపోనుంది. టీడీపీకి ఓ ఎంపీటీసీ ఎక్కువగా ఉన్నా.. మరో ఎంపీటీసీని గెల్చుకున్న జనసేన పార్టీ మద్దతు తెలిపినా… ఎమ్మెల్యే ఆర్కే ఓటు సాయంతో తామే ఎంపీపీని గెల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బీసీకి రిజర్వ్ అయిన ఎంపీపీ స్థానం కోసం.. బీసీ ఎంపీటీసీగా టీడీపీ నుంచి గెల్చిన జబీన్‌కు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను అధికారులు ఇవ్వలేదు. అప్పట్లో కలెక్టర్ వివేక్ యాదవ్ కూడా ఆమె బీసీ కాదని హైకోర్టుకు చెప్పారు. అయితే ఇప్పుడు టీడీపీ వ్యూహం మార్చింది.
వైసీపీలోని పద్మావతి అనే అభ్యర్థిని రెబల్‌గా నిలబెట్టి ఎంపీపీగా గెలిపించాలని ప్లాన్ చేసింది. ఆమె కూడా అంగీకరించింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఆర్కే పోలీసుల సాయంతో సొంత ఎంపీటీసీ పద్మావతిని రహస్య ప్రాంతానికి తరలించారు. దీంతో ఆమె కుమారుడు మీడియా ముందుకు వచ్చి ఆర్కేపై తీవ్ర విమర్శలు చేశారు. తన తల్లికి ఏదైనా జరిగితే ఆర్కే ..పోలీసులే బాధ్యత వహించాలన్నారు. మరో వైపు టీడీపీ , జనసేన ఎంపీటీసీలు అందరూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో క్యాంప్‌లో ఉన్నారు.
అందరికీ రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘం పోలీసుల్ని ఆదేశించింది. అయితే పోలీసుల్ని నమ్మలేని పరిస్థితి ఉండటంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నేరుగా దుగ్గిరాల ఎంపీపీ కార్యాలయానికి ఎంపీటీసీల్ని తరలించాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంగళగిరిలో ఎవరిది పై చేయి అవుతుందనేది గురువారం తేలే అవకాశం ఉంది.