అలనాటి కథానాయిక సావిత్రి జీవిత కథని వెండి తెరపై ‘మహానటి’ పేరుతో ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. సమంతకు ఓ ప్రధాన పాత్ర దక్కింది. ఈ టీమ్ లో అనుష్క కూడా చేరబోతోందని సమాచారం. ఇప్పుడు మరో నటుడు ‘మహానటి’ టీమ్ లో చేరాడు. తనే దుల్కర్ సల్మాన్. మణిరత్నం ఓకే బంగారంతో తెలుగులోనూ పాపులర్ అయ్యాడు దుల్కర్. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ కనిపించబోతున్నాడన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం సూర్యని ట్రై చేశారు. కానీ తాను సున్నితంగా తిరస్కరించడంతో.. దుల్కర్ రేసులోకి వచ్చాడు. ఇటీవల అశ్వనీదత్ దుల్కర్ సల్మాన్‌ని కలసి కథ, తన పాత్ర వివరించార్ట. జెమినీ గణేశన్ పాత్ర తీరుతెన్నులు నచ్చి దుల్కర్ మరో మాట లేకుండా.. ‘ఓకే’ అనేశాడని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.