ఈనెల 9న విడుదల కాబోతోంది సూర్య సినిమా `సింగం 3`. అనేక సార్లు వాయిదా పడి… ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు కూడా ఈసినిమా వస్తుందా, రాదా, లేదంటే ఆఖరి నిమిషాల్లో మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఎందుకంటే తమిళనాట రాజకీయాల పరిస్థితి అలా ఉందిప్పుడు. ఎప్పుడు ఎలాంటి ఆందోళనలు రేకెత్తుతాయో చెప్పలేకపోతున్నారు. ఇలాంటి గొడవల్లో సినిమా విడుదల చేయడం సాహసమే. అందుకే సూర్య సినిమా విడుదల మరోసారి కన్ఫ్యూజన్లో పడింది. అయితే చిత్రబృందం మాత్రం 9వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేస్తాం అంటున్నాయి. ఇలాంటప్పుడు సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తున చేయాలి. ‘సినిమా తప్పకుండా వస్తుంది ‘ అనే నమ్మకం బయ్యర్లలోనూ, ప్రేక్షకులలోనూ కల్పించాలి. ఆ విషయంలో సూర్య అండ్ కో ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్లు డల్‌గా ఉన్నాయి. దర్శకుడు హరి ఇంత వరకూ హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదు. శ్రుతిహాసన్, అనుష్కలను ప్రమోషన్లకు దించలేదు. సాధారణంగా సూర్య తన సినిమాలకు మంచి ప్రమోషన్లు ఇచ్చుకొంటాడు. పత్రికలు, ఛానళ్లు, వెబ్ సైట్లు అంటూ ప్రతి ఒక్కరికీ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తాడు. అయితే ఈ సినిమా విషయంలో పబ్లిసిటీ గురించి సూర్య కూడా అంతగా పట్టించుకోవడం లేదని టాక్. ఏదో నామ్ కే వాస్తే… అన్నట్టుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు సూర్య. దాంతో ఈ సినిమాని తెలుగులో కొన్న నిర్మాత లబో దిబోమంటున్నాడు. తెలుగు రైట్స్ కోసమే దాదాపుగా రూ.15 కోట్ల వరకూ వెచ్చించాడు. ఇన్ని కోట్లు ఇచ్చినా ప్రమోషన్ల విషయంలో మొండి చేయి చూపించడం ఏమిటి? అంటూ నిర్మాత ఆందోళన చెందుతున్నాడు. అదే ఈ సినిమాని తెలుగులో జ్ఞానవేల్ రాజా నేరుగా విడుదల చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని, అప్పుడు సూర్య కచ్చితంగా ప్రమోషన్లకు ప్రాధాన్యం ఇచ్చేవాడని, సినిమాని తెలుగులో అమ్ముకోవడం వల్ల ప్రమోషన్ల గురించి పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది.