`భగవంత్ కేసరి` హిట్ తో తన స్టామినా మరోసారి చూపించాడు బాలకృష్ణ. ఈ దసరాకి విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇదో మాస్ ఎంటర్టైనర్. ఈచిత్రంలో ఓ కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. దుల్కర్ క్యారెక్టర్ చాలా కీలకమని, కథలో దుల్కర్ రాకతో మలుపులు చోటు చేసుకొంటాయని తెలుస్తోంది. `సీతారామం` తో తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు, మార్కెట్ సంపాదించుకొన్నాడు దుల్కర్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు కీలక పాత్రలకు ఓకే చెబుతున్నాడు. `కల్కి`లో కూడా దుల్కర్ ఓ కీ రోల్ పోషించనున్నట్టు సమాచారం. ఇప్పుడు బాలయ్య సినిమా ఒప్పుకొన్నాడు. బాబీ చేసిన `వాల్తేరు వీరయ్య` కూడా ఓ మల్టీస్టారరే. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌కి రంగం సిద్ధం చేశాడు. ఈ సినిమాలో దుల్కర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? తను హీరోనా, విలనా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాలి. దుల్కర్ ఎంట్రీ గురించి చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పందించాల్సివుంది.