డబ్బు చుట్టూ తిరిగే కథలు భలే ఆసక్తిగా ఉంటాయి. ఎందుకంటే డబ్బు అనేది కామన్ ఎమోషన్. చేతిలో కాసులు గలగలలాడాలని ఎవరు కోరుకోరు? రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవడం అనేది ఓ అద్భుతమైన ఫాంటసీ. నిజ జీవితంలో అది జరక్కపోవొచ్చు. కానీ తెరపై హీరో అవన్నీ చేస్తుంటే.. చూడ్డానికి బాగుంటుంది. అందుకే ‘మనీ’ చుట్టూ తిరిగే కథలు సక్సెస్ఫుల్గా నడుస్తుంటాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ తరహా కథలు రెండు తయారవుతున్నాయి. ఒకటి.. ‘లక్కీ భాస్కర్’. రెండోది ‘మట్కా’.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ట్రైలర్లో డబ్బుకు సంబంధించిన చాలా డైలాగులు వినిపించాయి. ఈ సినిమా డబ్బు చుట్టూ నడిచే కథతో తీశారన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి.. ఉన్నట్టుండి కోటీశ్వరుడు అయిపోతాడు. అదెలా జరిగింది? తరవాత ఏమైంది? అనేది కథ. ‘సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కంటే, డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ’, ‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపై ఉండాలి’ అనే డైలాగులే.. ఈ కథాగమనం ఏమిటో చెప్పేశాయి.
‘మట్కా’ కథ కూడా డబ్బు గురించే. ”ఈదేశంలో వచలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తాడు. ఆ పదిపైసల కోసం మిగిలిన 99మంది కొట్టుకొంటారు” అనే డైలాగ్ వింటే ఈ కథలోని డెప్త్ ఏమిటో అర్థమవుతుంది. ఓ సాధారణ వ్యక్తి.. గ్యాంగ్ స్టర్ గా మారడమే ఈ కథ. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పలాస ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కించారు. నవంబరు 14న రాబోతోంది. ఈ రెండు సినిమాల మధ్య దూరం కేవలం రెండు వారాలు మాత్రమే.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన నేపథ్యాలు వేరు కావొచ్చు. కానీ కామన్ పాయింట్ మాత్రం డబ్బే. ఈజీ మనీ కోసం ఆరాటపడే కథానాయకుల్ని తెరపై చూడొచ్చు. చివర్లో ఓ మంచి సందేశం కూడా ఉండి ఉండొచ్చు. అది వేరే కథ. కాకపోతే.. ఆడియన్స్ ని టెప్ట్ చేసే ‘డబ్బు’ మాత్రం ఈ కథలకు మూల వస్తువు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాపై ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తారో, ఏ సినిమా నిర్మాతలకు డబ్బు మూటలు అందిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.