ఆంధ్రప్రదేశ్లో అమ్మేదే డూప్లికేట్ మద్యం బ్రాండ్లు. అయితే ఇప్పుడు వాటికే డూప్లికేట్ అమ్ముతున్నారు. ఇదంతా ప్రభుత్వ సౌజన్యంతోనే జరుగుతోంది. ఏపీలో ఇటీవల మద్యం ధరలు పెరిగాయి. కానీ ఎవరికీ తెలియదు. మద్యం కొనేవాళ్లకే తెలుసు. బూమ్ బూమ్ అనే బీరు మొన్నటి వరకూ 220 రూపాయలు ఉంటే.. 240 అమ్ముతున్నారు. ఇలా ప్రధానంగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలన్నీ పెరిగాయి. నిజానికి మందుబాబులు కొనుగోలు చేస్తోంది…ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటగట్టిన మద్యమే. కానీ.. ఇవి కొత్త బ్రాండ్లు. అంటే.. అదే పేరుతో కనిపించేలా ఉండేలా కొత్త బ్రాండ్లు అన్నమాట. ఎందుకంటే.. రేట్లు పెంచుకోవడానికి.
గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు ఎక్కువగా నకిలీలే అమ్ముతుంటారు. కాల్గేట్ టూత్ పేస్ట్ ను అచ్చంగా అలాగే ఉండేలా అమ్ముతారు.. కానీ కాల్గేట్ పేరుతో ఎక్కడో ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. ఇదంతా నకిలీ ఉత్పత్తుల మాఫియా టెక్నిక్. ఇదే పద్దతిని ఏపీ మద్యం బ్రాండ్లలో అమలు చేశారు . బ్రాండ్లో చిన్న మార్పు చేసి… రేట్లు పెంచారు. మొత్తంగా పది కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లుగా రహస్యంగా ఉత్తర్వులు జారీ చేశారు. అవేం కొత్త బ్రాండ్లు కాదు.. ఉన్న వాటినే స్పెల్లింగ్ మిస్టేక్స్తో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఆ పేరుతో రేట్లు పెంచుకుంటున్నారు. అంటే డూప్లికేట్కు డూప్లికేట్ బ్రాండ్లు అన్నమాట.
ఏపీలో మందు బాబుల్ని ప్రభుత్వం నిలువు దోపిడి చేస్తోంది. మద్యం అలవాటు ఉన్న వ్యక్తి కుటుంబం నుంచి సగం సంపాదన లాగేస్తోంది. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా కుదేలైపోతున్నాయి. కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు. అనేక గణాంకాల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా ఉండటం లేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు 150 శాతం కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. పేదల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు.