ప్రభుత్వం మారినా, పవర్ చేజారినా కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఇంకా దూకుడు తగ్గించడం లేదు. ఇటీవల దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలంటూ కొడాలి నాని కేవలం వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైతే తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యాక్షన్ లోకి దిగిపోయారు.
కాకినాడలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా, భవన నిర్మాణం చేపడుతుండటంతో ద్వారంపూడి అనుచరుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నోటీసులకు స్పందించకపోవడంతో భవనం కూల్చివేతకు అధికారులు ఉపక్రమించడంతో ద్వారంపూడి సంఘటన స్థలంకు చేరుకొని హల్చల్ చేశారు. పోలిసులను తోసుకుంటూ అక్రమ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాలు చేపట్టడమే తప్పు. అలాంటిది వాటి కూల్చివేతకు అధికారులు ఉపక్రమిస్తే ద్వారంపూడి రౌడీయిజం చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఆయన రేషన్ దందాపై కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్రారంభించిందని, ఈ విషయంలో త్వరలోనే ఆయన ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. అయినప్పటికీ ద్వారంపూడి ఇంకా తగ్గేదేలే అంటూ నానా యాగీ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ద్వారంపూడి ఏ ధైర్యంతో ఇలా రెచ్చిపోతున్నారు..? అనే చర్చ జరుగుతోంది. పవర్ పోయినా ద్వారంపూడి దౌర్జన్యం కొనసాగిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేతల ఆటకట్టించకపోతే గతంలో ఓవరాక్షన్ చేసిన వైసీపీ నేతలూ ఇదే పంథాను ఫాలో అవుతారని అంటున్నారు. అందుకే ఇలాంటి నేతల పట్ల సాధ్యమైన మేర చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ లు వస్తున్నాయి.