చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పని చేసిన ప్రస్తుత పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. దీంతో తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేవలం బదిలీతోనే సరిపెట్టలేదు. అంతకు మించి చర్యలు తీసుకుంటున్నారు. గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు కమిషనర్ గిరిజాశంకర్‌లపై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేశారు. గోపాలకృష్ణ ద్వివేదీపై ప్రధాన అభియోగం.. ఓటర్ల జాబితాను సిద్ధం చేయకపోవడం.
హైకోర్టుకు మాట ఇచ్చి కూడా ఆయన 2021 జాబితా ప్రకారం.. ఓటర్ల లిస్ట్‌ను ప్రకటించలేదు. దీని వల్ల.. అర్హులైన యువ ఓటర్లకు ఓటు హక్కు లేకుండా పోయిందని… దీనికి బాధ్యత అంతా ద్వివేదీనేనని నిమ్మగడ్డ సెన్సూర్ ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. అందులో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన ప్రొసీడింగ్స్.. గోపాలకృష్ణ ద్వివేదీ సర్వీస్ రికార్డుల్లో పొందు పరచాలని స్పష్టం చేశారు. అదే సమయంలో వారు ఎన్నికల విధులు నిర్వహంచడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు.
ఒక్క నిమ్మగడ్డ మాత్రమే కాదు.. ద్వివేదీపై కోర్టు కూడా ధిక్కరణ చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2019 ఓటర్ల జాబితా ఆధారంగా తనకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండాపోయిందని.. అఖిల అనే యువతి హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సమయంలో… పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ద్వివేదీ నిర్లక్ష్యాన్ని ప్రత్యేక అఫిడవిట్ రూపంలో ఎస్ఈసీ సమర్పించే అవకాశం ఉంది. అదే సమయంలో డివిజన్ బెంచ్ విచారణ సమయంలో.. ఎన్నికల జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు. ప్రకటించలేదు. ఈ విచారణలో ఈ అంశం కూడా.. ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంటే.. ద్వివేదీకి చాలా కష్టకాలం ఎదురవనుంది. ఆయన ఉద్యోగ జీవితం ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉంది.