“కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబితే అదే చేస్తున్నా..! వ్యక్తిగతంగా ఒక్క నిర్ణయం తీసుకోలేదు..!.”.. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి. .. ఏపీలో తాజా పరిణామాలపై సమర్థించుకున్న వైనం. అంటే.. ఏపీలో పరిణామాలు మొత్తం… తనకు ఏ మాత్రం సంబంధం లేకుండా సాగిపోతున్నాయని.. వ్యక్తిగతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని… ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ సీఈవో.. ఎన్నికల కోడ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు.. విధించిన ఆంక్షలు… వివరాలతో సహా.. సీఈసీకి చంద్రబాబు… తొమ్మిది పేజీల లేఖ రాశారు. సీఎంను పని చేయనివ్వకపోవడం.. ఏ నిబంధనలో ఉందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్.. ఏపీలో వ్యవహరిస్తున్న తీరు.. దేశంలో ఇతర రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా ఉంది. అందుకే… తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వీటిపై .. తనకేమీ సంబంధం లేదని… చెప్పుకోవడానికి ద్వివేదీ ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు రాసిన లేఖపై తాను స్పందించనని గోపాలకృష్ణ ద్వివేది నేరుగానే చెప్పేశారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులకు ఎన్నికల నియమావళి పుస్తకాలు అందజేశామని ఏ ఒక్క అంశంలోనూ తాను సొంత నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన మీడియా ప్రతినిధులకు తేల్చేశారు. అంటే… ఏ విషయంలోనైనా తాను నిమిత్తమాత్రుడినని చెప్పుకోవడానికే ద్వివేదీ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఏపీపై ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగిందని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా ఓట్ల తీసివేతకు… ప్లాన్ చేశారంటున్నారు. ఆ తర్వాత అధికారుల బదిలీలు జరిగాయంటున్నారు. ఆ తర్వాత పోలింగ్ శాతం తగ్గించడానికి సాంకేతిక లోపాలున్న ఈవీఎంలు వాడారని.. భద్రత లేకుండా.. బలగాలను తగ్గించారని కూడా.. చెబుతున్నారు. ఇప్పుడు పాలన చంద్రబాబు చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో.. దేశవ్యాప్తంగా.. ఏపీ వ్యవహారం చర్చనీయాంశం అవుతూండటంతో.. ద్వివేదీ ఎందుకైనా మంచిదన్న భావనలో .. మొత్తం ఢిల్లీ మీదకే తోసేస్తున్నట్లు చెబుతున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా… ఈసీ నియమించడమే కాదు.. ఇప్పుడు ఆయన.. ముఖ్యమంత్రిని తోసిరాజని సైతం అధికారాలు అనుభవించే స్వేచ్ఛ, వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఈసీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల కిందట… ఎల్వీ.. కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం వివాదాస్పదమయింది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని చెబుతున్నారు. ఈ విషయంలో ద్వివేదీపైనా విమర్శలు వస్తున్నాయి. అటు ఢిల్లీ చెప్పినట్లు చేస్తూ… తానే విమర్శలు ఎదుర్కొంటూ రావడంతో ఆయన ఒత్తిడికి గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే.. అంతా.. ఢిల్లీ వైపు చూపించి చేతులెత్తేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.