హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిని కూల్చాల్సిందేనని, అవసరమైతే చార్మినార్నుకూడా కూల్చాల్సిందేనంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, అదే విషయంపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఉస్మానియా ఆసుపత్రి పై కప్పుమాత్రమే కూలుస్తామని, పాతగోడలపైనే కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఆ పాత గోడలపైనే పది-పదిహేను అంతస్తుల భవనాన్ని నిర్మిస్తామని కూడా అన్నారు. పాత గోడలపై అన్ని అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తారో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న మహమూద్ అలీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలియటంలేదంటూ తెరాసలోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకత క్రమక్రమంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో మహమూద్ అలీ తన వ్యాఖ్యలతో విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నారని వాపోతున్నారు.