యాపిల్ ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ కోసం చాలా మంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 16వ తేదీన వీటి అమ్మకం మొదలవుతుంది. అప్పుడే ప్రీ బుకింగ్ జోరందుకుంది. భారత్ లో కనీసం 10 లక్షల యూనిట్లను అమ్మాలని యాపిల్ టార్గెట్ గా పెట్టుకుంది. మొత్తం మీద దాదాపు 6000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇందులో కనీసం సగం ఆన్ లైన్ ఇ రిటైల్ మార్గంలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఆఫ్ లైన్ మార్కెట్లో దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాకులో అమ్మడం వంటి సమస్య ఉండదు.
యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ల ధరలు రూ. 62 వేల నుంచి 92 వేల వరకు ఉన్నాయి. 16 జి బి ఫోన్ల ధర 62 వేలు. 128 జి బి ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధర 92 వేలుగా నిర్ణయించారు. యాపిల్ ఐఫోన్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఒక్క పే టీఎం 150 నుంచి 200 కోట్ల ఆదాయం ఆర్జించడానికి ప్లాన్ చేస్తోంది. ఐ ఫోన్ 6ఎస్ బుకింగ్ కు క్రోమా వెయ్యి రూపాయలు చార్జి చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ గురువారం రాత్రి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ కు అతిపెద్ద భాగస్వామి స్నాప్ డీల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
మొత్తానికి సంపన్నులే కాదు, ఎగువ మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా యూత్ ఈ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇది చేతిలో ఉంటేనే స్టేటస్ సింబల్ అవుతుందనే టాక్ వచ్చేసింది.