ఈ సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నాయి. అందులో ఒక్కటైనా వాయిదా పడితే బాగుంటుందన్నది అందరి ఉద్దేశ్యం. అయితే ఆ ఒక్కరూ ఎవరు? అనేదే పెద్ద ప్రశ్న. అలా వాయిదా వేసుకొనే అవకాశాలు ‘ఈగల్’, ‘నా సామిరంగ’ చిత్రాలకే ఉన్నాయి. ఈ రెండింటిలో ఈగల్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈగల్ చిత్రానికి సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇంత వరకూ జరగలేదు. కాబట్టి.. ఆ సినిమానే వాయిదా పడొచ్చు.
ఈగల్ ముందు 2 డేట్లు ఉన్నాయి. జనవరి 26న రావొచ్చు. లేదంటే ఫిబ్రవరి 2 కూడా ఖాళీగానే ఉంది. అయితే నిర్మాత మాత్రం విచిత్రంగా ఫిబ్రవరి 9న రావడానికి రెడీ అంటున్నాడని తెలుస్తోంది. ఆరోజు ‘టిల్లు స్వ్కేర్’ సినిమా రెడీగా ఉంది. టిల్లు ఎప్పుడో రావాల్సింది. కానీ… సోలో రిలీజ్ డేట్ కోసం ఆగింది. అయితే అదే రోజున వస్తామని ఈగల్ టీమ్ చెబుతోంది. సంక్రాంతి సినిమాల్లో ఎవరైనా తమ సినిమాని వాయిదా వేసుకొంటే, ఆ సినిమాకి సోలో రిలీజ్ డేట్ ఇచ్చేలా చూస్తామని దిల్ రాజు చెప్పారు. మరి ఆయన ఇప్పుడు టిల్లు నిర్మాత నాగ వంశీని ఒప్పిస్తారా? విషయం ఏమిటంటే.. నాగవంశీ సినిమా `గుంటూరు కారం` ఈ సంక్రాంతికి వస్తోంది. ఆయన ఎలాగూ సంక్రాంతిని క్యాష్ చేసుకొంటున్నాడు కాబట్టి… ఫిబ్రవరి 9.. ఈగల్ కి వదిలేయడం సబబుగానే కనిపిస్తోంది. కాకపోతే జనవరి 26, ఫిబ్రవరి 2 వదిలేసి, టిల్లు డేటే ఎందుకు అడుగుతున్నాడన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా… సినిమా వాయిదా వేసుకోవడం ఇష్టం లేక, ఇలాంటి లిటికేషన్ పెట్టారేమో..? ఈరోజు రాత్రి 8 గంటలకు నిర్మాతల మండలి ఓ అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో సంక్రాంతి సినిమాలు, వాటిలో వాయిదా పడే సినిమా గురించిన కీలకమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.