తెలంగాణలో మెడిసిన్ ఎంసెట్ -2 ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తోంది. లీకేజీ సూత్రధారులు, పాత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. లీకేజీ నిజమేనంటూ పూర్తి వివరాలతో సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తారని భావిస్తున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పరీక్షను రద్దు చేయవద్దని, లీకేజీతో లాభం పొందిన వాళ్ల ర్యాంకులను రద్దు చేస్తే చాలని అంటున్నారు. సచివాలయం ముందు ఇదే డిమాండ్ తో ధర్నా చేశారు. మళ్లీ పరీక్షంటే ఒత్తిడి తట్టుకోవడం కష్టమని వాపోయారు.
లీకేజీకి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులు రాజీనామా చేయాల్నారు. లీకేజీ వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై పలు అనుమానాలున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు కాని వాళ్లు కూడా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయని, వాళ్ల పాత్రమీదా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అంటే, మంత్రి పదవి లేకపోయినా చక్రం తిప్పే రాజ్యాంగేతర శక్తులకు లీకేజీతో సంబంధం ఉందనే ఆరోపణలను ఈ విధంగా ప్రస్తావించారు. ఇంతకీ అసలు సూత్రధారులు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.
లీకేజీకి ముఖ్యమంత్రే నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఢిల్లీలో ప్రశ్న పత్రాల ప్రింటింగ్ చేయించిన వారు భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. నిర్లిప్తత, నిర్లక్ష్యం కొంపముంచిందని ఇప్పుడు బాధపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు లక్షల మంది విద్యార్థులకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.