తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇంకోపక్క కాంగ్రెస్ కు ఆశావహులు, అసంతృప్తుల బెడద పొంచి ఉన్నట్టుగా కనిపిస్తోంది. టిక్కెట్ల జాబితా తుది మెరుగులు దిద్దుకుంటున్న తరుణంలో కొంతమంది చివరి వరకూ చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా! సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఇంటి చుట్టూ ఇలాంటి ఆశావహులే కొంతమంది చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం! పొత్తులో భాగంగా కాంగ్రెస్ పోటీ చేయకూడదనుకుంటున్న నియోజక వర్గాల నేతల్లో కొంతమంది హైదరాబాద్ లోనే మకాం వేసి.. గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారట! ఏయే స్థానాల్లో సొంతంగా పోటీలు చెయ్యాలి, ఏయే స్థానాలు పొత్తులో భాగంగా వదులుకోవాలన్న అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర సర్వే చేయించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మహబూబ్ నగర్, మక్తల్, దేవకద్ర, నారాయణపేట నియోజక వర్గాల కాంగ్రెస్ ఆశావహులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ పార్టీ కేడర్ ని బలోపేతం చేసుకుంటూ వచ్చామనీ, ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గడచిన రెండేళ్లుగా స్థానికంగా కార్యకలాపాలు చేపడుతున్నామనీ, కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా కాంగ్రెస్ పోటీకి దిగదంటే తమ పరిస్థితి ఏంటనే వాదన వారి నుంచి వినిపిస్తోంది. ఒకవేళ పొత్తులో భాగంగా పోటీ ఉండకపోతే, తమకు వేరే నియోజక వర్గంలోనైనా సీట్లు ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితోపాటు… కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేసే నియోజక వర్గాల్లో కూడా కొంతమందిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా, ఒక కుటుంబానికి చెందినవారికి ఒక టిక్కెట్టే ఇవ్వాలనే హైకమాండ్ సూచన కూడా తెలంగాణలో మరో సమస్య అవుతుందనే అభిప్రాయమూ కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన భార్య కూడా గత ఎన్నికల్లో పోటీ చేశారు.. ఇప్పుడూ టిక్కెట్ ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి సోదరుల సంగతి తెలిసిందే. కొండా సురేఖ కుటుంబం కూడా కనీసం రెండు టిక్కెట్లు కోరుతున్నారు. ఈ చర్చ స్క్రీనింగ్ కమిటీ ముందు కూడా ప్రస్థావనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై ఏఐసీసీ అభిప్రాయం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క… బుజ్జగింపుల పర్వం కూడా మొదలైందని తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి అసంతృప్తీ బయటకి రాకుండా… రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఇస్తామనీ, ఇతర నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామంటూ నేతలకు హామీలు ఇచ్చే కార్యక్రమానికి పీసీసీ తెర తీసిందని తెలుస్తోంది.