తెలంగాణలో ఇప్పుడు ఉపఎన్నికల మూడ్ కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల ఏడాది అంటూ పాలనలో చివరి ఏడాదిని చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఏడాది మొత్తం పాలక పార్టీ.. ప్రతిపక్షాలు అన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతాయి. మరో పని పెట్టుకోవు. ఎలాంటి ఎన్నికల ఏడాది తెలంగాణలో వచ్చేసింది. గత ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లడంతో.. వచ్చే ఏడాది అక్టోబర్లో తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. మరో పధ్నాలుగు నెలలో ఉన్నాయి. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇక ఫుల్ ఎలక్షన్ మూడ్లోకి వెళ్తారు.
అయితే తెలంగాణలో ఇప్పుడు ఉపఎన్నికలు తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ ఆలోచన ఏమిటన్నది స్పష్టత లేదు. కానీ ఆరు నెలలు ముందుగా ఎన్నికలుక వెళ్లే ఆలోచన కేసీఆర్కు ఉందని గతంలో ప్రచారం జరిగింది. ఆయన జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అయితే తర్వాత ముందస్తు ఉండదని తేల్చేశారు. ఇప్పుడు అలాంటిప్రచారం జరగడం లేదు. కానీ ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల వ్యూహంతో కేసీఆర్ మళ్లీ ముందస్తు గురించి ఆలోచించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నికల పేరుతో రాజకీయ రచ్చ పెట్టుకోవడం కన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్తే బెటరన్న ఆలోచన టీఆర్ఎస్ పెద్దల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టం. తమను ట్రాప్లో లాగాలనుకున్న వారికి రివర్స్ ట్రాప్లోకి లాగగలరు. కేసీఆర్ ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాలుగా కసరత్తులు పూర్తి చేశారు. పీకే టీం ఆయన కోసం పని చేస్తోంది. ఈక్రమంలో కేసీఆర్ .. బీజేపీకి ఝులక్ ఇచ్చేందుకు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నా.. ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.