మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంప దృశ్యాలు అందర్నీ భయపెట్టాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల ధ్వంసం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ టీవీ చానల్ సమ్మిట్‌లో ప్రకృతి విపత్తుల వల్ల జరిగే మౌలిక వసతుల నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే ఏమిటన్న సందేహం వస్తుంది.
బ్యాంకాక్‌లో ఉన్న హై రైజ్ భవనాల కన్నా ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయి. ఆకాశం వైపు అంతకంతకూ అంతస్తులు పెంచుకుంటూ పోతున్నారు. భూకంపం లాంటివి వస్తే వాటి పరిస్థితి ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. నిజానికి ఇలాంటి ఆకాశహర్మ్యాలు భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తారు. భూమి ఊగిపోయినా కదలకుండా ఉండేలా స్ట్రక్చర్ ఉంటుంది. అయితే అది కొంత వరకే. థాయ్ ల్యాండ్ లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై దాదాపుగా ఎనిమిది శాతం చూపించింది. అలాంటి భూకంపాలు వస్తే ఎలాంటి స్ట్రక్చర్ అయినా నిలబడటం కష్టం.
బ్యాంకాక్‌లో కొన్ని హై రైజ్ భవనాలు కూలిపోయాయి. కొన్ని కదిలినా.. వాటిపై ఉన్న స్విమ్మింగ్ ఫూల్స్ నుంచి నీళ్లు కిందపడ్డాయి కానీ భవనాలు కూలలేదు. కానీ అలా కదిలిపోవడం వల్ల ఎంత సేఫ్ అన్నది కూడా ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ భూకంపాల జోన్ లో లేదు. సాధారణంగా భూకంపాలు సముద్ర తీరం ప్రాంతాల్లో ఎక్కువ వస్తాయి. ఒక వేళ హైదరాబాద్ వంటి చోట్ల భూమి కంపించినా అది చాలా మందికి తెలియనంతగా ఉంటుంది. అందుకే హైదరాబాద్‌కు ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.