భారత్-మయన్మార్ దేశాల సరిహద్దు ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున 4.37 గంటలకు సుమారు ఒక నిమిషంపాటు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదు అయింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరానికి 33కిమీ దూరంలో ఉన్న తామేన్గ్ లాంగ్ అనే ఊరులో భూమికి 10 కిమీ లోతులో ఈ భూకంప కేంద్ర ఉన్నట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది. ఈ భూకంప ప్రకంపనలు దేశంలోని అస్సాం, మణిపూర్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ ఖండ్ రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. అలాగే మయన్మార్ దేశంలో సరిహద్దు ప్రాంతాలలో ఈ ప్రభావం బాగా కనిపించింది. ఈ భూకంపం ప్రభావం ఇంఫాల్ లో చాలా ఎక్కువగా కనిపించింది. అక్కడ అనేక భవనాల గోడలు పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ భూకంపం వలన ఇంఫాల్ నగరంలో ఒక వ్యక్తి మరణించాడు.100మందికి పైగా గాయపడినట్లు సమాచారం.