జనజీవితాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు కేంద్రం కార్యచరణ ప్రారంభించింది. ఒక్క సారే లాక్ డౌన్ ఎత్తివేత సాధ్యం కాదు కాబట్టి… ప్రణాళికాబద్దంగా ఆంక్షలు తొలగిస్తూ వస్తోంది. ప్రస్తుతం కంటెన్మెంట్ జోన్లకే.. ఆంక్షలు పరిమితం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మార్చి 22న జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. మార్చి 21వ తేదీ వరకూ… భారతీయుల జీవితాలు ఉరుకులు, పరుగుల మీద నడుస్తూ ఉండేవి. పెళ్లిళ్లు, సినిమాహాళ్లు. మాల్స్.. ఇలా.. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా కనిపించేవారు. రాజకీయ పార్టీల సభలకు అయితే.. డబ్బులిచ్చి మరీ గుంపుల్ని తయారు చేసేవారు. కానీ ఆఫ్టర్ కరోనా కాలంలో ఇవన్నీ సాధ్యం కావు. పెళ్లిళ్లు, సినిమాహాళ్లు, మాల్స్ , రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు కుదరవు. ఆ మాటకొస్తే జనం గుమికూడే.. ఏ సమావేశానికి అనుమతి లభించడం సాధ్యం కాదు. మెల్లగా సడలింపులు లభిస్తున్న సమయంలో ఇదే విషయం స్పష్టమవుతోంది.
ప్రజారవాణా … దేశ ప్రజల జీవనశైలిలో ఓ భాగం. ఎక్కడికి వెళ్లాలన్న జనం రైళ్లు,బస్సులు, విమానాల ఆధారపడతారు. సొంత వాహనలు ఉన్న వారు తక్కువ. ఉన్నా.. దూరాభారం కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేవారు ఎక్కువ. కానీ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జిట్ ప్లాన్‌లో లేదు. దీన్ని ఇప్పుడల్లా మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే పరిస్థితి లేదంటున్నారు. స్కూళ్లు ఉండవు.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉండదు.. సినిమాహాళ్లు ఉండవు.. మాల్స్ ఉండవు.. ఇవన్నీ పక్కన పెట్టి.. లాక్ డౌన్ సడలింపులు ఇస్తోంది కేంద్రం. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే… స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. అలా అని లాక్ డౌన్ పేరుతో.. అన్నింటికీ తాళాలు వేసుకుని కూర్చుంటే.. ఆకలి చావులు ప్రారంభమవుతాయి. అందుకే కేంద్రం వరుసగా.. మినహాయింపులు ఇస్తూ పోతోంది. నెల రోజులయిన సందర్భంగా వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు.. గ్రీన్ జోన్లలో వ్యాపార వ్యవహారాలను పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర దుకాణాలను తెరిచేందుకు చాన్స్ ఇచ్చింది. అయితే అన్నీ గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రమే అమలవుతాయి.
వైరస్‌పై గెలిచేశామని ప్రకటించుకున్న కొన్ని దేశాలు.. సాధారణ జన జీవనానికి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు.. బీచ్‌లను కూడా ఓపెన్ చేశాయి. ఆయా దేశాల్లో పూర్తిగా వైరస్ అంతం కాలేదు. కానీ.. కట్టడి చేయగలమని నమ్మకం వచ్చిన తరవాత లాక్ డౌన్ ఎత్తేశారు. భారత్‌లో అలాంటి పరిస్థితి సాధ్యం కాదు. అక్కడ జనాభా తక్కువ. అక్కడ జీవన శైలి వేరు. కానీ భారత్‌లో పరిస్థితి వేరు. లాక్ డౌన్ ఉన్నప్పుడే ఎవరూ… రూల్స్ లెక్క చేయని పరిస్థితి. అందుకే.. కరోనా కేసులు పూర్తిగా తగ్గి..భరోసా వచ్చిన తర్వాత మాత్రమే.. దేశంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేత సాధ్యమవుతుందని నిపుణుల అంచనా. అందుకే ప్రణాళికా బద్దంగా.. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నారు.