హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ అనుచరులు ఎవర్నీ ఆయన పక్కన ఉండకుండా చేయడంలో టీఆర్ఎస్ ముఖ్యనేతలు సక్సెస్ అయ్యారు. సామ, భేద, దాన, దండోపాయాలను ప్రయోగించి… ఒంటరిని చేశారు. అయినా ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు.ఇప్పుడు ఈటల రాజేందర్ వంతు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన టీఆర్ఎస్లోని తన సన్నిహితుల్ని అదీ కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వారిని ఆకర్షిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తొలి విడత చర్చలు జరిగాయని అంటున్నారు.
టీఆర్ఎస్లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉంటే… కొంత మందిపై పార్టీ హైకమాండే అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా విధేయతా సమస్య కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదు అన్న సిగ్నల్స్ లభించినవాళ్లు ఇప్పుడే మంచి దారి చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు ఈటల రంగంలోకి దిగారు. టీఆర్ఎస్కు ఇక భవిష్యత్ లేదన్న ఓ అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఈ కారణంగానే ఈటలతో కనీసం అరడజన్ మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అయితే కేసీఆర్ చేస్తున్న రాజకీయం చాలా మందిని గందరగోళ పరుస్తోంది. బీజేపీతో యుద్ధమే అని తెలంగాణలో చెబుతారు కానీ..ఢిల్లీకి వెళ్లే సరికి సీన్ మారిపోతుంది. చివరికి ఏదో మాయ చేస్తారని.. బీజేపీలో చేరితే.. మొదటికే మోసం వస్తుందేమోనన్న ఆందోళనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందుకే ఈటల రాజేందర్‌తో చాలా మంది టచ్‌లో ఉన్నప్పటికీ గీత దాటేందుకు మాత్రం అనేక మంది సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని భావిస్తున్నారు. గతంలో తనను ఒంటరి చేసిన కేసీఆర్‌ను.. దెబ్బకొట్టి తీరాలని ఈటల పట్టుదలగా ఉన్నారు.