ఈటల రాజేందర్ విషయంలో నాన్చుడుకు చాన్స్ లేదని టీఆర్ఎస్ నిరూపించేసింది. ఆయన రాజీనామా చేయకపోతే.. తాము అనర్హతా వేటు వేస్తామని సిగ్నల్స్ ముందుగానే పంపింది.అయితే రాజీనామా చేయడానికి అనర్హతా వేటు వేయడానికి చాలా తేడా ఉంది. అనర్హతా వేటు వేస్తే.. ఆయనకు సింపతీ మరింత పెరుగుతుంది.అందుకే రాజీనామా చేయడానికే ఒత్తిడి తెచ్చారు. చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఈటల రాజీనామా చేసేశారు. శనివారం ఉదయం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి, స్పీకర్ ఆఫీసులో రాజీనామా లెటర్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వెంటనే రాజీనామాను ఆమోదించారు.
హుజూరాబాద్ స్థానం ఖాళీ అయిందని.. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే.. అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే.. ఈరోజు నుంచి ఆరు నెలల్లోపు ఉపఎన్నికలు జరగాల్సి ఉందన్నమాట. ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత టీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. ఆయన రాజీనామా చేయడం ఖాయం కావడంతో… ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. వరుస ఉపఎన్నికలతో అలసిపోతున్నా… ఎప్పటికప్పుడు.. తప్పనిసరిగా పోరాడాల్సిన ఉపఎన్నికలు కావడంతో వెనక్కి తగ్గడం లేదు. ఈటల ఉపఎన్నికను మాత్రం… కావాలని కేసీఆర్ తెచ్చి పెట్టుకున్నదిగా భావిస్తున్నారు.
అయితే ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్‌తోనే సిద్ధమయ్యారని.. బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో పోటీ చేసినా.. అక్కడ ఆయనకు మిగిలేదేమీ ఉండదని కేసీఆర్ నమ్ముతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే.. తటస్థ భావన ఏమైనా కలిసి వచ్చేదేమో కానీ… బీజేపీ తరపున పోటీ చేయడం వల్ల ఆయన…చాలా నష్టపోతున్నారన్న అంచనాకు టీఆర్ఎస్ వచ్చింది. అందుకే.. రాజీనామా లేఖ అందిన వెంటనే క్షణాల్లో నిర్ణయం తీసుకున్నారు.