కృష్ణాష్టమికి ముందురోజున గుజరాత్ లోని అహ్మదాబాద్ పట్టణంలో రోడ్లపక్కన ఉన్న హోర్డింగ్ ల మీద రాసిన రాతలు చదివినవారికి, ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్ – ఆవుమాంసం తినొద్దనే చెప్పినట్లే అనిపిస్తుంది. అంతేకాదు, ఆవుమాంసం తింటే రోగాలొస్తాయని కూడా ఈ హోర్డింగ్స్ చూసినవారికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైగా, గుజరాత్ బీజేపీ ప్రభుత్వమే దగ్గరుండి ఈ హోర్డింగ్స్ పెట్టించినట్లు కూడా తెలిసిపోతుంది. 2002లో ఎక్కడైతే మతకల్లోలాలు చెలరేగాయో అక్కడే (అహ్మదాబాద్ లోనే) బిజీపే ప్రభుత్వం పనిగట్టుకుని ఇలాంటి ప్రచార హోర్డింగ్స్ పెట్టించడం గోమాతను నిజంగా రక్షించడానికా ? లేక మతపరమైన ప్రయోజనాలను సంరక్షించుకోవడానికా? అన్న అనుమానం రాకమానదు. గోజాతిని సంరక్షించడం తప్పుకానేకాదు, ఆవులను పూజించాలనడం అంతకంటే తప్పుకాదు, ఆవుమాంసం తినొద్దని హితవుచెప్పడం కూడా తప్పేమీకాదు. కానీ, తప్పేమిటంటే, ఖురాన్ గ్రంథంలో ఉన్నదో, లేదో సరిగా చూసుకోకుండా ఏదో ఒక అనామిక అనువాద పుస్తకంలోని ప్రవచనాలపేరిట ఉన్న మాటలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ శాఖ పరిధిలోని `గోసేవా బోర్డ్’ హడావుడిగా హోర్డింగ్స్ పెట్టించడం కచ్చితంగా తప్పే. ఈ చర్య ముస్లీంలేనేకాదు, అందర్నీ హర్ట్ చేస్తున్నదనే చెప్పాలి. పైగా ఈ హోర్డింగ్ ల్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారి ఫోటో, ఆ పక్కన ఇస్లాం మత చిహ్నాలు పెట్టడంతో ఇదేదో అధికారికంగానూ, చాలా విశ్వసనీయంగానూ అందించిన సమాచారమన్నట్టు ఫోజొకటి. అయ్యా, గుజరాత్ ప్రభుత్వ పెద్దలారా, గోవధకు వ్యతిరేకంగా ప్రచారం చేయండి, కానీ ఇలా అభూతకల్పనలతో ప్రచారంచేయకండి, అలాచేస్తే అది మీకే చేటుచేస్తుందన్న సత్యం గ్రహించండి..
ఖురాన్ ను అడ్డుగా పెట్టుకుని
హిందువుల్లో అధికులు ఆవులను పరమపవిత్రంగా చూస్తుంటారు. ఒక్క ఆవులోనే సకలదేవతలు స్థిరనివాసమేర్పరుచుకున్నారన్నది హిందువుల విశ్వాసం. హిందూమత గ్రాంథాల్లోకూడా ఆవును `గోమాత’గానే భావిస్తారు. అందుకే గోవధ నిషేధించాలని కోరుతుంటారు. అయితే లౌకికరాజ్యమైన భారతదేశంలో గోవధనిషేధం పూర్తిగా సాధ్యంకాకపోవచ్చు. ఈ విషయంలో హిందు-ముస్లీంల మధ్య తరచూ బేధాభిప్రాయాలు తలెత్తుతూనేఉన్నాయి. ఆవు దేవతా స్వరూపమని హిందువులు భావిస్తుంటే, ఆవునికూడా ఆ దేవుడే సృష్టించాడుకనుక, దేవుడ్ని పూజించండి, ఆవునుకాదని ముస్లీంమతప్రచారకర్తల్లో కొందరంటున్నారు. శతబ్దాలతరబడి ఈ చర్చ సాగుతూనేఉంది. ఎవరిచర్చను వారు బలోపేతం చేసుకోవడంకోసం వీరు ముస్లీం గ్రంథాల్లోని విషయాలను తెలుసుకుని వాటిని తమ వాదనలో అనుకూలంగా మలచుకుంటుంటే, మరో పక్కన వారు, వేదాలు, ఉపనిషత్తులు, సంహితలతోపాటు పురాణఇతిహాసాలను అర్థంచేసుకుని- వాటిలోని కొన్ని శ్లోకాలను- తమ వాదనకు బలంచేకూర్చడానికి ఉపయోగించుకుంటున్నారన్నది నిజం. ఇందులో పోటీతత్వమే కనబడుతుందితప్ప, వాస్తవాలను వెలుగుచూపుతూ సర్వమానవాళిని ఉద్ధరించే నైజం కనబడటంలేదు.
సరిగా, అలాంటిదే ఇప్పుడూ జరిగింది. ఖురాన్ ను అడ్డుపెట్టుకుని గోవధ తప్పనీ, రోగాలొస్తాయని భయపెడుతూ చైతన్యం కలిగించాలన్న తొందరలోనే హోర్డింగ్స్ వెలిశాయి. గోవధ సమస్యకు పరిష్కారమార్గం చెబుతున్నట్లుగా గుజరాత్ ప్రభుత్వం అడ్డగోలుగా కొత్తతరహాలో ప్రచారం మొదలుపెట్టినట్లుగానే అర్థంచేసుకోవాలి. గుజరాత్ రాష్ట్రప్రభుత్వఆధీనంలోని `గోసేవా, గోచర్ వికాస్ బోర్డ్’ ప్రజల్లో అవగాహనకలిగించడానికి రోడ్ల పక్కన హోర్డింగ్స్ ఏర్పాటుచేసినట్లు చెప్పుకోవచ్చు. అలాగనే, కరపత్రాలను పంచిపెడుతోంది. పైకి చూసినప్పుడు ఇదంతా చిత్తశుద్ధితో చేసేపనిలాగానే కనబడుతుంది. కానీ ఆ పనిలో వక్రబుద్ధి ఉన్నట్టు నిశితంగా చూస్తే అర్థమవుతుంది. రెచ్చగొట్టే పోకడ కనబడుతోంది.
ఏం రాశారు ?
గోవులను గౌరవించండి, గోమాంసం తినడం మానుకోండంటూ ప్రచారంచేస్తూనే, ఇస్లాం మతగ్రంథమైన ఖురాన్ లో ఆవుమాంసం తినడంవల్ల అనేక రోగాలువస్తాయంటూ ఉన్నదని హోర్డింగ్స్ మీద తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. ఈ ప్రచార హోర్డింగ్స్, కరపత్రాలమీద గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ (మోదీ తర్వాత ఆమె ముఖ్యమంత్రి అయ్యారు) బొమ్మను కూడా ముద్రించారు. అంతేకాదు, ఈ ప్రచార పత్రాల్లో మరోవైపున ముస్లీంమత చిహ్నాలైన నెలవంక, నక్షత్రం గుర్తులను కూడా ముద్రించారు. ఇదంతా మీడియాలో వార్తకావడంతో పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఇది కట్టుకథేనా ?
ఇస్లాంమతగ్రంథమైన ఖురాన్ లో నిజంగానే ఆవుమాంసం తింటే రోగాలొస్తాయని ఉన్నదా? అన్న చర్చ ఇప్పుడు చోటుచేసుకుంది. అయితే ముస్లీం నాయకులు మాత్రం ఖురాన్ లో ఎక్కడా అలాంటి ప్రస్తావనలేదనీ, ఇదంతా కట్టుకథేనంటూ ఖండిస్తున్నారు. అఖిలభారత ముస్లీం పర్సెనల్ లాబోర్డ్ కు చెందిన ముఫ్తీ అహ్మద్ దెవల్వీ ఈ విషయంపై వివరణఇస్తూ, `పవిత్ర ఖురాన్ లో నేనెక్కడా ఇలాంటి సందేశం చూడలేదు, అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి, అరబిక్ భాషలో ఉన్న ప్రతిసూక్తి పవిత్ర ఖురాన్ లో ఉన్నట్లనికాదు. అరబిక్ భాషలోని వేరే వాక్యాలను చూసి అది ఖురాన్ లో ఉన్నట్టు భావించడం సరికాదు’ అని చెప్పారు. ఆవు సంగతేమిటోగానీ, పంది మాంసం మాత్రం తినకూడదని ఇస్లాం మతస్థులు భావిస్తుంటారు. అది చాలా తప్పని అంటారు. కానీ ఆవు గురించి ఎక్కడా ప్రస్తావనకు రాలేదని అంటున్నారు.
చిరు పుస్తకంలో అలా ఉందట !
అలాంటప్పుడు మరి హోర్డింగ్స్ రాతలకు ఆధారాలేంటి? ఆవుమాంసం తింటే రోగాలొస్తాయని ఖురాన్ లో ఉన్నట్టు చెబుతున్నవారు దాన్ని ఎలా సమర్థించుకుంటారన్నది ప్రశ్న. గోసేవా, గోచర్ వికాస్ బోర్డ్ చైర్మన్ , కేంద్ర మాజీమంత్రి డాక్టర్ వల్లభాయ్ కాతిరియా ఏంచెబుతున్నారంటే, ఆయన ఖురాన్ అనువాద పుస్తకంలో ఆ వాక్యాలను చూశారట. హిందీ, గుజరాతీ భాషల్లో అనువదించబడిన 20పేజీల చిరు పుస్తకమది. అయితే, ఎవరు అనువదించారో ఆయనకు గుర్తులేదని చెప్పడం గమనార్హం.
గోసేవా గోచర్ వికాస్ బోర్డ్ తన వెబ్ సైట్ ద్వారా కూడా గోసంరక్షణకు పూనుకుంది. గోజాతిని అభివృద్ధిచేయడం, గోవులనూ గోమాత సంతానాన్ని సంరక్షించడం కోసం ప్రచారం చేపట్టినట్టు చాలా స్పష్టంగా ఈ సంస్థ తన వెబ్ సైట్ లో పేర్కొంది. అంతేకాదు, ఈ బోర్డు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ పరిధిలోనే ఉండటం మరోవిశేషం.
గోపూజ – గోవధ
ఈ రెండూ పరస్పర వాదనలు. ఇందులో ఏదిమంచిదన్న విషయం అంతతొందరగాతేలేదికాదు. అయితే, ఇక్కడ మనం రోజుకో బంగారుగుడ్డుపెట్టే బాతుకథ గుర్తుకుతెచ్చుకోవాలి. ప్రతిరోజూ బంగారు గుడ్డు పెట్టే బాతను కోసి చూస్తే బోలెడు గుడ్లు ఉంటాయనే పేరాశతో చంపేస్తాడు ఆ బాతు యజమాని. కానీ తీరా బాతును కోసిచూస్తే లోపల బంగారుగుడ్లులేవు. అంటే దీని ఆర్థం ఏమిటి? ప్రతిరోజూ మనకు ఏదోవిధంగా ఉపయోగపడుతున్న వస్తువు లేదా జంతువును జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాని దురాశకుపోతే దుఃఖం తప్పదు. గోవులోనే సకలదేవతలున్నారన్న వాదనతో ఇతరులు అంగీకరించకపోవచ్చు. ఇందులో పెద్దనష్ఠంలేదు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్థికసూత్రాన్ని ఆధారంగాచేసుకున్నా ఆవును తినడంకంటే, దాన్ని క్షేమంగా చూసుకుంటేనే లాభాలు ఎక్కువ (పాలు, వెన్న, నెయ్యి, వాటి సంతానమైన కోడెదూడలు, ఎరువుగా ఉపయోగపడే పేడ, ఔషధ గుణాలు) కాబట్టి గోసంతతిని పెంచుకోవడమే మంచిదని చెప్పవచ్చు. అంటే, గోవధకంటే గోపూజ మానవాళికి ఆర్థికంగా ప్రయోజనకారన్నమాట. ఆవుమాంసం తింటే రోగాలొస్తాయని, చస్తారని భయపెట్టడంకంటే, ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలున్నాయని చెప్పి చైతన్యం కలిగించడమే మిన్న.
సరే, పైన ప్రస్తావించిన హోర్డింగ్స్ విషయానికే మళ్ళీ వెళదాం. అక్కడ అత్యుత్సాహంతో అవుమాంసం తింటే రోగాలొస్తాయని- ఖురాన్ ప్రవచనాల్లో ఉన్నట్టు రాసేశారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. అలా కాకుండా ఆర్థికంగా ఏది లాభమన్నట్టు చెప్పినప్పటికీ వారునుకునే చైతన్యం కలిగిఉండేది. అవతలి మతస్థులు మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో లేదా పురాణఇతిహాసాల్లో ఉన్న శ్లోకాలకు అర్థంతెలుసుకుని తమకు అనుకూలంగా భాష్యంచెబుతున్నప్పుడు మనం కూడా అదేపని చేయాలన్న ఉత్సుకత తప్ప, వాస్తవకోణాలను ఆవిష్కరించే ప్రయత్నం సరిగా జరగలేదనడానికి నిలువెత్తు సాక్ష్యం గుజరాత్ లోని ఈ హోర్డింగ్స్. ఇప్పటికైనా గోసేవా సంస్థలు కావచ్చు, లేదా ఇతర సంస్థలు గోవధ వల్ల మానవాళికి కలిగే నష్టమేమిటన్నది సరైన కోణంలో వివరిస్తూ చైతన్యం కలిగించడం మంచిది.
– కణ్వస
kanvasa19@gmail.com