సార్వత్రిక ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా రానుందా..?. ఢిల్లీ కేంద్రం ఎన్నికల సంఘం స్పీడ్ చూస్తూంటే.. రాజకీయ పార్టీలన్నీ ఇదే భావనతో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు దాదాపుగా సన్నాహాలు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం… తేదీలపైనా కసరత్తు చేసింది. 2014లో జరిగినట్లుగా… ఈ సారి తొమ్మిది విడతల్లో ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉందని గతంలోనే జరిగింది. గతంలో ఇచ్చినట్లుగా కాకుండా.. రెండు, మూడు వారాల ముందుగా ప్రకటన చేసే ఆలోచన కూడా ఉందని.. చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈసీ ఈ విషయంపై స్పందించనప్పటికీ… మొత్తానికి అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల్ని పరుగులు పెట్టించి సన్నాహాలు చేయించింది.
ఇప్పుడు కొత్తగా అన్ని రాష్ట్రాలకు అధికారుల బదిలీలపై స్పష్టమైన సూచనలు జారీ చేసింది. మూడేళ్ల కన్నా.. ఎక్కువ కాలం.. ఒకే చోట ఉన్న అఖిలభారత సర్వీసు అధికారుల్ని బదిలీ చేయాలని.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ఏపీలో కొంత మంది సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగాయి. అదే సమయంలో.. ఏపీ ఎన్నికల అధికారిని కూడా మార్చారు. ఆయన మూడేళ్లుగా ఆ పదవిలో లేనప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం… ఆయనను తప్పించి.. గోపాలకృష్ణ ద్వివేదీ అనే అధికారికి బాధ్యతలు అప్పగించింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరహా బదిలీలు చేసినట్లు… కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు చూస్తూంటే.. ఎన్నికల ప్రకటన కోసం.. అన్ని ఏర్పాట్ల చేసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెలలోనే ఎన్నికల ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదన్నట్లుగా… రాజకీయపార్టీలు అంచనా వస్తున్నారు. ప్రధానంగా.. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల సన్నాహాలను దాదాపుగా పూర్తి చేసుకుంది. ప్రత్యేకంగా… టార్గెట్ పెట్టుకుని మరీ నరేంద్రమోడీ ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి కాలంలో… పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనూ.. మోడీ ఎన్నికల ప్రచారసభల్లో ప్రసంగించిన సందర్భాలున్నాయి. అటు ఈసీ సన్నద్దత.. ఇటు బీజేపీ పరుగులు చూస్తూంటే.. విపక్ష పార్టీలు పూర్తిగా సిద్ధం కాక ముందే యుద్ధం ప్రారంభించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.