ఆంధ్రప్రదేశ్ లో టీచర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచేందుకు జగన్ రెడ్డి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు గండిపడింది. టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రారంభించారు. సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఆ వివరాలను శుక్రవారం ఉదయం 11 గంటల లోగా సీఈవోకు పంపనున్నారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావించారు.
దీంతో అసలు సిబ్బందిపై చర్చ జరిగింది. సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశంపైనా చర్చించారు. వారిని తీసుకున్నా సిబ్బంది సరిపోరని తేలడంతో టీచర్లను నియమించాలని ఆదేశించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్నారు. అంటే.. పోలింగ్ బూత్ ఇంచార్జిగా ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు. టీచర్లే ఇంచార్జులుగా ఉంటారు కాబట్టి జగన్ రెడ్డి ప్లాన్ పూర్తి రివర్స్ అయినట్లవుతుంది.
ఒక్క టీచర్లు కాదు ఏపీలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఏ ఒక్క ఉద్యోగి సంతృప్తికరంగా లేరు. అయినా టీచర్లు ఇంకా ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని.. చట్టం కూడా తీసుకు వచ్చారు. ఆ చట్టం ఎన్నికల సంఘానికి వర్తించదు. ఇది తెలిసి కూడా చేశారు. చివరికి టీచర్ల చేతుల్లోకే ఎన్నికల విధులు వెళ్తున్నాయి.