ఏపీలో వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని.. ఓటర్ల జాబితా అంశంలోనూ చేతి వాటం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సమయంలో ఇలాంటి ఆదేశాలు రావడం ఏపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రక్రియను బూత్ లెవల్ ఆఫీసర్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది.
అయితే ప్రభుత్వం చేతుల్లోనే వారు ఉంటారు కాబట్టి.. వారి పనిని వాలంటీర్లు హైజాక్ చేస్తారని.. తాము చేయాలనుకున్నది చేస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఓటర్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలంటే.. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని బీఎల్వోకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు చేస్తారు. మామూలుగా అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు. కానీ ప్రజలు చాలా మందికి అవగాహన ఉండదు.
అందుకే బీఎల్వోలు చేయాలి. ఈ ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈసీ ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.అయితే అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ.. అంతా కరెక్ట్ చేస్తున్నామని వాదిస్తున్నారు. గతంలో ఉపఎన్నికల సమయంలోనూ వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. ప్రతి యాభై ఇళ్ల ఓటర్ల వివరాలు వాలంటీర్ ఫోన్లో ఉంటాయి. ఎన్నికల సమయంలో కూడా ఫోన్లను ఈసీ స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఎంత వరకు అమలు చేస్తారో చూడాల్సి ఉంది.