అసెంబ్లీని రద్దు చేసిన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.. ఎన్నికల సంఘం.. అసెంబ్లీని రద్దు చేసిన రెండు వారాల తర్వాత ప్రకటించింది. ఆ తర్వాత అయినా… కోడ్ అమలును సీరియస్గా పట్టించుకుందా ..? అంటే అదీ లేదు. ప్రభుత్వం తరపున మంత్రులు.. యధావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ మొత్తం ప్రభుత్వ ప్రకటనలతో ఫ్లెక్సీలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు మాత్రం అవేమీ పెద్ద తప్పులుగా అనిపించడం లేదు. ఓ తాజా మాజీ ఎమ్మెల్యే… తనకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే రూ. 5 లక్షలు ఇస్తానని.. చెబుతూ మీడియా కెమెరాలకు చిక్కినా చర్యలు లేవు. పైగా ఎన్నికల అధికారి రజత్ కుమార్ బతుకమ్మ చీరల పంపిణి, రైతు బంధు చెక్కుల పంపిణి పాత పథకాలేనని.. అడ్డంకులేమీ ఉండవన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో… కాంగ్రెస్ నేతుల ఈసీపీ తీవ్ర అసహనంతో ఉన్నారు.
అయితే హఠాత్తుగా ఎన్నికల సంఘం.. టీఆర్ఎస్కు షాకిచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డంకి వస్తోందంటూ అనుమతి నిరాకరించింది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది. 280 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పటికే 50 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. అయితే ఈసీ మోకాలడ్డటంతో చీరల పంపిణీకి బ్రేక్ పడినట్లయింది. సహజంగానే కాంగ్రెస్ నిలిపి వేసిందని… ప్రచారం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
చీరల పంపిణీనే ఈసీ నిలిపి వేస్తే.. ఇక నేరుగా.. నగదు పంపిణీని మాత్రం అంగీకరిస్తుందా అన్నది మరో ప్రశ్న. రైతు బంధు పేరుతో.. నవంబర్ లో రైతులకు చెక్కులివ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ చీరకే అంగీకారం రాలేదు.. కాబట్టి… చెక్కులకూ రాకపోవచ్చు. కచ్చితంగా ఎవరో ఒకరు ఫిర్యాదు చేయకుండా ఉండరు. ఎందుకంటే… ప్రీపాన్డ్ గానే పాత పథకం అని చెప్పుకునేందుకు నాలుగు నెలల కిందట కేసీఆర్ ఈ పథకం ప్రవేశ పెట్టారని అందరూ విశ్లేషించారు. ఇప్పుడు రైతుల ఖాతాల్లో నగదు వేస్తామన్నా ఈసీ అంగీకరించకపోవచ్చు. దాంతో కేసీఆర్కు మరో అస్త్రం దొరుకుతుంది. కాంగ్రెస్ రైతుల నోటి దగ్గర తిండి తీసేస్తోందని రచ్చ రచ్చ చేయడం ఖాయంగా కనిప్తోంది.