ఏపీ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. అయితే, రాజకీయంగా ఇంత తీవ్రమైన చర్చ జరుగుతున్నా, దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ఇంతవరకూ సీఈవో ప్రయత్నించడం లేదు. ఇంతకీ ఏపీలో నష్టం జరిగిందా, జరిగితే ఏ మేరకు జరిగింది, దానికి ఎవరు బాధ్యతులు వహించాలి… ఇలాంటి అంశాలపై అధికారికంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా సీఈవో ద్వివేదీ మాట్లాడిన సందర్భం లేదు. పైపెచ్చు, ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే… ఏపీలో ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారుల తీరుపై ద్వివేదీ అసంతృప్తిగా ఉన్నారట! క్షేత్రస్థాయిలో సిబ్బంది ఫెయిలైతే, విమర్శలన్నీ తానొక్కడినే భరించాలా అనే తరహాలో ఆయన వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను రాష్ట్రస్థాయి అధికారిని మాత్రమేననీ, తన పరిమితులు ఇంతే అంటూ ఈ మొత్తం చర్చ నుంచి పక్కకు తప్పుకునే విధంగా ఆయన తీరు ఉంటోందని సమాచారం. జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం తన మాట వినలేదనీ, అటు జాతీయ స్థాయి నుంచి కూడా ఇదే పరిస్థితి అనే ధోరణిలోకి నెమ్మదిగా వెళ్లిపోతున్నారు. ఇప్పుడు తీరిగ్గా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు అంటున్నారు.
ఇంతకీ, అసలు సమస్య ఎక్కడ తలెత్తింది..? దీనంతటికీ మూల కారణం ఎక్కడుంది..? ఎన్నికల ముందు ఇష్టానుసారంగా ఉన్నపళంగా ఉన్నతాధికారులను బదిలీ చేయడం దగ్గర అసలు లోపం ఉంది! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సమయంలో బదిలీ చేశారు. దానికి సరైన కారణమంటూ చెప్పలేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు చెయ్యగానే ఫిర్యాదులకు, దాన్నే పరిగణనలోకి తీసుకుని చర్యలకు దిగేశారు. డీజీపీ మీద ఆంక్షలు పెట్టి, ఆయన్ని కదలనీయకుండా చేశారు. వ్యవస్థలో కీలకమైన చీఫ్ సెక్రటరీ, డీపీజీల విషయంలోనే ఇలా వ్యవహరిస్తే.. వీళ్ల కిందనున్న ఇతర విభాగాలన్నీ క్రియాశీలంగా పనిచేయలేదన్నట్టు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి..? ఛీఫ్ సెక్రటరీ, డీజీ ఇంటెలిజెన్స్, ప్రకాశం జిల్లా ఎస్పీ, కడప ఎస్పీ, కలెక్టర్లు, ఇంకొందరు అధికారులు… ఈసీకి అధికారం ఉందని ఇలా అందర్నీ మార్చే పడేశారు. ఆయా అధికారుల నుంచి కనీసం వివరణ కూడా తీసుకోలేదు.
సి.ఎస్.నే మార్చేసిన తరువాత, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ తమకు సహకరించలేదూ, ఇప్పుడు వారిమీద నివేదికలు తెప్పించుకుని చర్యలు తప్పవని ఆవేదన చెందితే ఏం ఉపయోగం..? సి.ఎస్.ని మారుస్తున్న ఈసీవో అభిప్రాయం తీసుకునే నిర్ణయం తీసుకుంటారు కదా? కనీసం అప్పుడైనా… ఎన్నికలకు ముందు ఆయన్ని మారిస్తే అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది, ఎన్నికల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుంది, సమస్యలు వస్తాయని ఈసీవో చెప్పలేకపోయారా..? ఈ మొత్తం వ్యవహారానికి కారణం ముమ్మాటికీ అధికారుల బదిలీలే. దాని సైడ్ ఎఫక్ట్స్ ఇవన్నీ. దాన్ని కారణంగా గుర్తించరు! కానీ, ఇప్పుడు కలెక్టర్ల నుంచి, అధికారుల నుంచి నివేదికలు తీసుకుంటామంటున్నారు. ఈవీఎంల మొరాయింపులు, ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ, సరైన భద్రతా బలగాలు లేకపోవడం… వీటన్నింటికీ ఎవరు బాధ్యత వహిస్తున్నట్టు..? అధికారుల నుంచి సహాకారం అందలేదని సీఈవో చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా..? అయినా, ఎన్నికల కోడ్ అంటూ వచ్చాక రాష్ట్రంలో ఆయనే కదా సర్వాధికారి! ఆయన కింద ఉన్న వ్యవస్థలు ఫెయిలయ్యానని చెప్తే… ఎవరు ఫెయిలైనట్టు..?