మామూలుగా అయితే తనకు ఓట్లు వేయరని డిసైడయ్యారేమో కనీ బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని ప్రజల్ని బెదిరిస్తున్నారు. భార్యాబిడ్డలను పక్కన పెట్టుకుని చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రకటన వివాదాస్పదమయింది. గెలిపిస్తే విజయయాత్ర లేకపోతే తన కుటుంబం శవయాత్ర జరుగుతుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై ఈసీ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేశారు. అయినా పాడి కౌశిక్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఈ ఉదయం మరోసారి వీడియో విడుదల చేశారు.
అందులోనూ అదే తరహా బెదిరింపులకు పాల్పడ్డారు. చంపుకుంటారో సాదుకుంటరో మీ ఇష్టమని బెదిరించారు. కౌశిక్ రెడ్డి గురించి హుజూరాబాద్ లోనే కామెడీగా మాట్లాడుకుంటున్నారు. ఆశల్లేవని పూర్తిగా చేతులెత్తేసి చివరి ప్రయత్నంగా ఇలా బెదిరిస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈటల మీద గెలవలేనని భావిస్తే .. పట్టుబట్టి .. ఎందుకు టిక్కెట్ తీసుకున్నారని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రజలు జాలి చూపించి అయినా ఓట్ల వేస్తారని ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈసీ కేసు నమోదు చేసిన తర్వాత కూడా అాలానే మాట్లాడుతున్నారు. ఆయనను చూసి ఇతర అభ్యర్థులు కూడా అదే బాట పడుతున్నారు. భట్టి విక్రమార్కపై పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కూడా అదే తరహాలో చంపుకుంటారా.. సాదుకుంటారా అంటూ వీడియో విడుదల చేశారు.