తెరాస పార్టీ ఈనెల 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. మే 1న జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నందున జిల్లాలో ఎనికల కోడ్ అమలవుతోంది. ఈ సమయంలో పార్టీ, ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవడం, తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని నేతల ప్రసంగాలు పాలేరు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి కనుక జిల్లాలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొనేందుకు అనుమతించవద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. కానీ ప్రతీ ఏటా తమ పార్టీ ఈవిదంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటూనే ఉంటుందని, ఈసారి కూడా ఉపఎన్నికలు ఉంటాయనే సంగతి తెలియక ఖమ్మం జిల్లాలో ప్లీనరీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసుకోన్నాము కనుక అనుమతించవలసిందిగా కోరుతూ మంత్రి కె.టి.ఆర్. ఎన్నికల సంఘానికి ఒక లేఖ వ్రాశారు. ఎన్నికల సంఘం ఆ అభ్యర్ధనని మన్నించి తెరాస పార్టీ ఖమ్మంలో ఏప్రిల్ 27న ప్లీనరీ నిర్వహించుకోవడానికి అనుమతించింది. అందుకు ఎటువంటి షరతులు కూడా విదిన్చినట్లు లేదని సమాచారం. ఈసీ నిర్ణయం పాలేరు ఉపఎన్నికలలో తెరాస గెలుపుకి చాలా దోహదపడవచ్చు.