తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వేతన సవరణను అసెంబ్లీలోనే ప్రకటిస్తానని తేల్చిచెప్పారు. బడ్జెట్లో కేటాయింపుల్లో స్పష్టత లేదు. ఎనిమిది వేల కోట్ల వరకూ పీఆర్సీ కోసం కేటాయించారని నిపుణులు వివిద పద్దులను విశ్లేషించిన తర్వాత తేల్చారు. కానీ క్లారిటీ లేదు. నిజంగా పీఆర్సీ కోసం అంత మొత్తం అని చెప్పి ఉంటే… ఉద్యోగులు తమకు ఎంత మేర జీతం పెరుగుతుందో లెక్కలు వేసుకునే వారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయాల్సి ఉంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక రావడంతో.. పీఆర్సీ ప్రకటనకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీకి దరఖాస్తు చేసుకుని పర్మిషన్ తీసుకున్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించవద్దని ఓ సలహా ఇచ్చి ఈసీ పర్మిషన్ ఇచ్చింది. దీంతో కేసీఆర్ ఇక అసెంబ్లీలో ప్రకటనచేయడమే మిగిలింది.
ఇరవై ఆరో తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆ లోపే ప్రకటనచేయాల్సి ఉంది. కరోనా కారణంగా ముందే ముగించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం.. అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటన వీలైనంత త్వరగా పూర్తి చేసి సమావేశాలు వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత మేర ఇస్తారన్నది ఇప్పుడు ఉద్యోగ సంఘాలను ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న. బిస్వాల్ కమిషన్ కేవలం ఏడుఅంటే ఏడు శాతం మాత్రమే సిఫార్సు చేసింది. అప్పట్లో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. కేసీఆర్ అంత తక్కువగా ఇవ్వరని వారు నమ్మారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాల నేతలను పిలిచిన కేసీఆర్ 29 శాతం పీఆర్సీకి హామీ ఇచ్చారు.
దీంతో ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి పాలాభిషేకాలు కూడాచేశారు. అంటే ఓ రకంగా కేసీఆర్ మైండ్ గేమ్ ఆడినట్లే. ఇరవై తొమ్మిది శాతానికి అందరూ అంగీకరించినట్లుగా భావిచాల్సి ఉంటుంది. కేసీఆర్ దానికే ఫిక్సవుతారా.. లేక పెంచుతారా.. తగ్గిస్తారా అన్నది ఉద్యోగ సంఘాలను వేధిస్తున్న ప్రశ్న. గెలిచి తీరాల్సిన సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఉండటంతో నిరుత్సాహపర్చరని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ప్రకటన కోసం ఉద్యోగ సంఘాలన్నీ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి.