ఫామ్-7 దరఖాస్తులు ఇస్తే తప్పేముంది, దాన్ని ఓటు పరిశీలనకు ఇచ్చిన దరఖాస్తుగా చూడాలనే కొత్త అర్థంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సంగతి తెలిసిందే. అంటే, ఒక వ్యక్తి ఓటు ఉందో లేదో తెలియాలంటే ఇదొ కొత్త పద్ధతి అన్నమాట! తాము చేసిన తప్పును సర్దిచెప్పుకోవడం కోసం జగన్ చెప్పిన వక్రభాష్యం దీన్ని చాలామంది చూస్తున్నారు. ఈ నేపథ్యంలో… ఫామ్-7 దరఖాస్తులకు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగా స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ… ఫామ్ -7కి సంబంధించి 8 లక్షల 76 వేల దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. వాటిని పరిశీలించేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారనీ చెప్పారు.
ఇప్పటి వరకూ 1,61,005 దరఖాస్తులను పరిశీలించామనీ, అందులో 5,309 మాత్రమే నిజమైవి అని గుర్తించామని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే, మిగిలినవన్నీ నకిలీ అన్నమాట! అయితే, 8,76,000 దరఖాస్తుల్లో ఇంతవరకూ ఎన్నికల సంఘం పరిశీలించినవి కేవలం 1.61 లక్ష మాత్రమే. వీటిలో నిజమైన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి..? అంటే, దాదాపుగా నకిలీ దరఖాస్తులే 97 శాతంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఎందుకు ఎన్నికల సంఘానికి అందినట్టు..? ఇంకెవరు…. ప్రతిపక్ష పార్టీ పెట్టినవే కదా. తామే పెట్టించామని జగన్ కూడా ఒప్పుకున్నారు కదా! దాదాపు 97 శాతం దరఖాస్తులు నకిలీ అంటే ఏంటి అర్థం..? ఉన్న ఓటరుకు హక్కు లేకుండా చేసే ప్రయత్నమే అవుతుంది కదా. ఉన్న వ్యక్తి ఓటును దూరం చేసే ప్రయత్నం కచ్చితంగా నేరమే.
తెలుగుదేశం పార్టీకి చెందినవారు అక్రమంగా ఓటర్లను చేరుస్తున్నారు, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తీసేస్తున్నారు, కాబట్టి ఫామ్ 7 పెట్టించామని గవర్నర్ ను కలిసిన సందర్భంగా జగన్ చెప్పారు కదా! తాజాగా ఎన్నికల సంఘం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే… వాటిలో నకిలీవే ఎక్కువ. ఈ లెక్కన ఎవరు అక్రమంగా దరఖాస్తులు చేసినట్టు..? ఇంత పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు ఇచ్చి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు..? వారికి ఉన్న అభద్రతాభావంతో వ్యవస్థల్ని దుర్వినియోగం చేసేలా వ్యవహరిస్తున్నది ఎవరు..? అన్నిటికీమించి, ఆంధ్రా ప్రజల్లో ఒకరమైన ఆందోళనలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు..?