వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ యూటర్న్ శాసనమండలి విషయంలో జరగనుంది. మండలిని రద్దు చేసేయాలని తీర్మానించేసి.. కేంద్రానికి పంపిన ఏపీ సర్కార్.. ఇప్పుడు అక్కడి నుంచి తదుపరి చర్యల కోసం వేచి చూస్తోంది. ఈ లోపు… పెద్ద ఇబ్బందికర పరిణామం ఏర్పడింది. అదే.. ఎమ్మెల్సీ ఎన్నిక. టీడీపీ ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 18న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. జులై 6న పోలింగ్ నిర్వహించనుంది. శాసనసభ్యుల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
శాసనమండలి వద్దే వద్దని అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ ఇప్పుడు అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలిసినా కూడా.. తాము మండలిని రద్దు చేయాలని తీర్మానించుకున్నామని…. అది అసలు అవసరం లేదని.. జగన్ అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టారు. తన పార్టీ తరపున మండలిలో సభ్యులుగా ఉండి.. మంత్రులుగా ఉన్న వారిని రాజ్యసభకు పంపారు. వారితో మంత్రి పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు. ఇంత గట్టిగా మండలి రద్దుకు ప్రయత్నిస్తున్న జగన్… ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చని చెబుతున్నారు.
అయితే.. శాసనమండలి రద్దు ఇప్పుడల్లా సాధ్యం కాదని.. ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేసినా.. పార్లమెంట్ సమావేశాలనే కొత్త పద్దతుల్లో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఏపీకి సంబంధించిన బిల్లును పెట్టి ఆమోదింప చేసే తీరిక ఉండదు. అందుకే.. ఆ మండలి సీటును.. టీడీపీకి వదిలేయడం కన్నా.. పోటీకి పెట్టి గెలిపించుకోవడం మంచిదన్న భావనలో.. వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే.. శాసనమండలి రద్దు విషయంలో యూటర్న్ తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఒక వేళ ఇదే నిర్ణయం తీసుకుంటే.. జగన్మోహన్ రెడ్డికి తొందరపాటు ఎక్కువని రుజువయిందన్న విమర్శలు కూడా వస్తాయి. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..!