టీఆర్ఎస్ పేరు మార్చి భారత రాష్ట్ర సమితిగా చేర్చి.. తమది జాతీయ పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఈసీ మాత్రం .. ఒక్క తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్కు రాష్ట్ర హోదా ఉందని స్పష్టం చేసింది. ఏపీలో కూడా రాష్ట్ర పార్టీ హోదా లేదు. అంటే ఒక్క తెలంగాణలో మాత్రమే ఆ పార్టీకి కారు గుర్తు ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితుల్ని బట్టి గుర్తులను కేటాయిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత పార్టీల స్థితిగతుల్ని గుర్తింపుల్లో ఈసీ మార్పులు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీకి అవసరమైన పారా మీటర్స్ సాధించడంతో ఆ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ జాతీయ పార్టీలుగా ఎన్సీపీ, సీపీఎం , టీఎంసీ, సీపీఐ వంటి పార్టీలకు జాతీయ హోదా రద్దు అయింది.
ఏపీలో టీడీపీ, వైసీపీ రాష్ట్ర పార్టీలుగానే గుర్తింపు పొందాయి. అయితే జనసేన పార్టీకి ఈసీ గుర్తింపు పొందడానికి అవసరమైన ఓట్లు, సీట్లను గతంలో పొందలేదు. ఈ కారణంగా జనసేన ఇప్పటికీ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీగానే ఉంది. ఆ పార్టీకి కామన్‌గా కేటాయిస్తున్న గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ కేటగరిలో చేర్చింది. అయితే జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తే ఆ పార్టీకే కేటాయిస్తారు. ఉపఎన్నికల్లో జనసేన పార్టీ తిరుపతిలో పోటీ చేయకపోవడం వల్ల గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించారు. వారు ప్రత్యేకంగా గ్లాస్ గుర్తు కోసమే విజ్ఞప్తి చేశారు. జనసేన పోటీ చేసి ఉంటే ఆ పార్టీకే కేటాయించేవారు. జనసేన పోటీ చేయని చోట గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయిస్తారు.
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి. అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి. అయితే జనసేనకు ఆరు శాతం ఓట్లు కంటే ఎక్కువే వచ్చాయి కానీ ఒకటే అసెంబ్లీ స్థానం వచ్చింది. కనీసం ఒక లోక్‌సభ స్థానం గెలిచినట్లయినా గుర్తింపు దక్కి ఉండేది. ఏ సీట్లు సాధించకపోయినా ఎనిమది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది.