తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ లకి ఎన్నికల సంఘం ఈరోజు నోటీసులు పంపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసంలో ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యి వారికి కొన్ని హామీలు ఇవ్వడం, మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఇతర పార్టీల నేతలని తెరాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుంది కనుక 48 గంటలలోగా లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వవలసిందిగా కోరుతూ ఎన్నికల సంఘం వారిద్దరికీ నోటీసులు పంపించింది. ప్రతిపక్షాల నుండి అందిన పిర్యాదులపై స్పందిస్తూ ఎన్నికల సంఘం వారిరువురికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ హామీలు ఇచ్చినట్లు సాక్ష్యాధారాలు ఉండవు కనుక ఆయన తను ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్పుకొనే అవకాశం ఉంటుంది. కానీ మంత్రి కేటీఆర్ సచివాలయంలో మీడియా సాక్షిగా ఇతర పార్టీల నేతలకు తెరాస కండువాలు కప్పి ఆహ్వానించినట్లు పక్కాగా సాక్ష్యాధారాలున్నాయి కనుక ఆయన తన చర్యలను సమర్ధించుకోవడం కష్టమే. బహుశః మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం కానీయని హామీ ఇచ్చి బయటపడతారేమో? లేదా ఊహించని కొత్త విషయం మరేదయినా చెపుతారో చూడాలి.