హైదరాబాద్: ‘బిగ్ బిలియన్ డే సేల్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్’, ‘దివాలీ సేల్’. ఈ కామర్స్ వెబ్సైట్లు ఆఫర్లతో కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు సర్వత్రా ఈ ఆఫర్ల గురించే చర్చ జరుగుతోంది. పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోటానికి ‘ఫ్లిప్‌కార్ట్’, ‘అమెజాన్’, ‘స్నాప్ డీల్’ సైట్లు రకరకాల పేర్లతో, ఆఫర్లతో రంగంలోకి దిగాయి. కనీవినీ ఎరగని తగ్గింపు ధరలకు అమ్ముతున్నామని ఒకరంటే, అసలు ధరలలో ఒక సున్నా తొలగించి అమ్ముతున్నామని మరొకరు ఊదరగొడుతున్నారు.
ఈ వెబ్సైట్ల ఆఫర్ల వలన కస్టమర్లు ఎంత ప్రయోజనం పొందుతున్నారో తెలియదుగానీ న్యూస్ పేపర్ల యాజమాన్యాలుమాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్లు తమ ఆఫర్లను చాటిచెప్పటంకోసం న్యూస్పేపర్లలో భారీస్థాయిలో యాడ్లను గుప్పిస్తున్నాయి. ఈ యాడ్లుకూడా ఆషామాషీ యాడ్లు కాదు… ఫుల్ పేజ్ జాకెట్ యాడ్లు. జాకెట్ యాడ్ అంటే న్యూస్ పేపర్లో ప్రచురించే అత్యంత ఖరీదైన యాడ్. మొట్ట మొదటి పేజిలో వార్తలేమీ లేకుండా నిర్దేశిత కంపెనీ యాడ్ వస్తుంది. గత మూడురోజులుగా అమెజాన్ కంపెనీ వరసగా అన్ని పత్రికలకూ జాకెట్ యాడ్లు ఇస్తోంది. ఇవాళయితే డబుల్ జాకెట్ యాడ్ ఇచ్చింది. అంటే మొదటి రెండు పేజీలూ ఆ కంపెనీ ప్రకటనే ఉంటుందన్నమాట.
సాధారణంగా ఈ కామర్స్ వెబ్సైట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ యాడ్లను ఎక్కువగా ఇచ్చేవి. ఈ సంవత్సరం ప్రింట్ మీడియాకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రింట్లో ఇచ్చే యాడ్ కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావించటమే దీనికి కారణం. ఇది న్యూస్ పేపర్ యాజమాన్యాలకు కలిసొచ్చింది. పై మూడు ప్రధాన వెబ్సైట్లే కాకుండా, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ వంటి గ్రోసరీ రీటైలర్ వెబ్సైట్లు అన్నీ కలిపి ఈ పండగ సీజన్లో ఎడ్వర్టయిజ్మెంట్ల కోసం రు.2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ వెబ్సైట్ల పుణ్యమా అని న్యూస్ పేపర్ యాజమాన్యాలకు దసరాకు ముందే పండగ వచ్చేసినట్లుంది. మామూలుగానే పండగ సీజన్లో యాడ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ కామర్స్ వెబ్‌సైట్లద్వారా అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది.