భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ”మేక్ ఇన్ ఇండియా”, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “అమరావతి గ్రోత్ ఇంజన్” అయ్యేపనులు కావని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) తాజా నివేదిక కూడా దృవపరుస్తోంది. పెట్టుబడులు ఆర్ధికధోరణులను విశ్లేషించే అంతర్జాతీయ సంస్ధ “మూడీ” ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ప్రజల కొనుకోలు శక్తులు ఇప్పట్లో పెరిగే వాతావరణం కనిపించడం లేదని పేర్కొంది.
దేశంలో చేయండి దేశంలోనే కొనండి అనే ”మేక్ ఫర్ ఇండియా” కార్యక్రమమే ప్రస్తుత ఆర్ధిక వాతావరణంలో భారత్ కు ఉపయోగపడుతుంది. బిజెపి మాతృసంస్ధ ఆర్ ఎస్ కూడా అభివృద్ధిపై సొంత నమూనాను రూపొందించుకోవాలని ఒక సమన్వయ సమీక్షలో బిజెపి మంత్రులను ఆదేశించింది.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై నివేదిక విడుదల చేసే ఐఎంఎఫ్ అక్టోబరు నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక పరిస్థతి స్తబ్దంగా వుంది. ధనిక దేశాలు, వర్ధమాన దేశాల కొద్దిగా కోలుకుంటున్నాయి. లాభాలు ఉంటేనే పెట్టుడులు వస్తాయి. కొనేవారు లేక ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం పడిపోయింది. ఈ పతన పరిమాణం 0.2 శాతం చేరుకుంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టండని మోడీ, చంద్రబాబు విదేశాలను కోరుతున్నారు. కానీ వారు ఇక్కడి పెట్టుబడులు పెడితే… తయారైన ఉత్పత్తులను కొనేవారు లేరు. ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటేనే ప్రపంచ ఆర్థికపరిస్థితి బాగుపడుతుంది. ధరలు పడిపోయినా.. కొనేవారు లేరు. డాలర్ అన్నింటికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఎగుమతులపై ఆధారపడిన దేశాలు దెబ్బతిన్నాయి. ఎగుమతులపై ఆధారపడి దేశ ఆర్థికవ్యవస్థను నిర్మించాలనుకుంటే చైనాకు ఎదురైన పరిస్థితి మనకు ఎదురవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే సామర్ధ్యం చైనా, ఇండియా లకు లేదు. మోదీ, బాబు కార్యక్రమాల ప్రకారం , ప్రోత్సాహక రాయితీలకు ఆశపడి విదేశీ పెట్టుబడులు వస్తాయి అనుకుందాం! అయితే వాటి ఉత్పత్తులకు ఎగుమతి ఆర్డర్లు రావాలి. అలా రావాలంటే దేశదేశాల్లో ప్రజలకు కొనుకోలు శక్తులు దండిగా వుండాలి. కొలుకునే దారిపట్టిన పెద్దదేశాలు ఇప్పట్లో కొత్తకొనుకోళ్ళు చేస్తాయనుకోవడం భ్రమే అవుతుంది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే 18 దేశాలు తిరిగి భారత్ లో పెట్టుబడులు పెట్టండని ప్రచారం చేస్తున్న మోదీ ఇచ్చే అవకాశాలను, అమరావతి నిర్మాణం కోసం సింగపూర్, జపాన్, చైనాలకు బాబు ఇచ్చే అవకాశాలను ఆయాదేశాల సంస్ధలు వినియోగించుకుంటాయి. రాయితీల ను వినియోగించకుని దేశంలో, రాష్ట్రంలో విదేశీ సంస్ధలు కాళ్ళుపెడతాయి. అయితే వాటికి లాభదాయకమైన, గిట్టుబాటైన మార్కెటలు రూపుదిద్దుకునే వరకూ ఉత్పత్తులను ప్రారంభించవు. ఏదో సాకు చూపుతూ కాలయాపన చేస్తూనే వుంటాయి. ఇదే సరైన వ్యాపార లక్షణం కూడా…
ఇదంతా ప్రధానికో ముఖ్యమంత్రికో తెలియదని కాదు. వారి ఆలోచనలు స్ధబ్దంగా వున్న ఆర్ధిక వాతావరణాన్ని వినియోగించకుని ఆవకాశాలు ఇవ్వడం ద్వారా పరిశ్రమలు స్దాపింపచేయాలన్న సదుద్దేశ్యలే కావచ్చు…అయితే పెట్రోలుకి కావాలంటే ముందగా డబ్బిచ్చేసిన వారు షేర్ అటో కదిలే వరకూ చచ్చినట్టు అందులోనే కూర్చోవాలి. ఇంకో ఆటో వచ్చినా ఎక్కడం కుదరదని ప్రజలకు బాగా తెలుసు. మేక్ ఇన్ ఇండియా అయినా అమరావతిని నిర్మించండి అయినా ప్రస్తుతానికి ముందే డబ్బు ఇచ్చేసి డ్రయివర్ కోసం ఎదురు చూస్తూ ఆటోలో కూర్చోవడం లాంటిదే!
ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!!