ఓ వైపు ఆర్థికంగా అస్తవ్యస్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ, రుణమాఫీల బకాయిలు కూడా చెల్లించలేని స్థితికి చేరింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు, నీటిపారుదల ప్రాజెక్టులు తెల్లఏనుగుల్లా మారాయి. ఖజానాపై పెను భారం మోపుతున్నాయి. వేల కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
జలయజ్నంలో భాగంగా అప్పుడెప్పుడో తలపెట్టిన ప్రాజెక్టులు ఖజానా పాలిట శత్రువుల్లా మారాయి. అంచనా వ్యయం భారీగా పెరుగుతోంది. కల్వకుర్తి ప్రాజెక్టును అప్పుడే నిర్మించి ఉంటే 1500 కోట్ల రూపాయలతో అయిపోయేది. ఇప్పుడు దాని అంచనా వ్యయం 5070 కోట్ల రూపాయలకు చేరింది. తీరా నిర్మాణం పూర్తయ్యే నాటికి రకరకాల కారణాలతో ఖర్చు మరింత పెరగదని చెప్పలేం.
భీమా ప్రాజెక్టును 1400 కోట్లతో కట్టాలనుకున్నారు. ఇప్పుడు దాని అంచనా వ్యయం రెండున్నర వేల కోట్లు దాటింది. నెట్టెంపాడును కట్టడానికి 1428 కోట్ల ఖర్చవుతుందని మొదట అంచనా వేశారు. ఇప్పుడు అది 2404 కోట్లకు పెరిగింది. 109 కోట్లతో నిర్మించాలనుకున్న కోయిల్ సాగర్ అంచనా వ్యయం ఏకంగా 710 కోట్లకు పెరిగింది.
ధనిక రాష్ట్రమైన తెలంగాణ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. చెరువులను బాగు చేసుకోవడం నుంచి సాగునీటి సదుపాయాన్ని పెంచడం వరకూ చాలా పనులు చేయాల్సి ఉంది. అలాగే ఇతరత్రా అభివృద్ధి పనులూ తప్పనిసరి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను పూర్తి చేయడానికి భారీగా నిధులు కావాలి.
మరోవైపు, రుణమాఫీ బకాయిలను తీర్చడం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి కష్టంగా మారింది. అతికష్టం మీద రుణమాఫీ సొమ్ములో సగానికి పైగా చెల్లించారు. మిగతాది మరో రెండేళ్లలో చెల్లిస్తామన్నా బ్యాంకులు ఒప్పుకోవడం లేదు. దీంతో రైతులు అప్పులు చేసి మరీ పాత బాకీ తీర్చి కొత్త అప్పు అడుగుతున్నారు. బ్యాంకు రుణాలు పొందిన రైతులు రుణమాఫీ వల్ల
ప్రయివేటు అప్పుల పాలు కావడం అనే విచిత్రమైన పరిస్థితి ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో.
ఇంకో వైపు, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని వందలాది ఆస్పత్రులు నిర్ణయించాయి. యాజమాన్యాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలు జరిపిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. అప్పటి వరకూ అంతే సంగతులు.
పాత ప్రాజెక్టులు భారంగా మారుతుంటే మల్లన్న సాగర్ వివాదం ముదురుతోంది. నష్టపరిహారం అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయి. రైతులకు తగిన పరిహారం చెల్లించాలని, బలవంతంగా భూములను గుంజుకోవద్దని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ వివాదం వీలైనంత త్వరగా పరిస్కరిస్తే రైతులకు ఆందోళన తప్పుతుంది.