ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. అగ్రవర్ణాలలో కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే కేంద్రానికి పంపిన బిల్లును వెనక్కి తీసుకుని..ఆ పది శాతం కోటాలో ఐదు శాతం.. కాపులకు ఇస్తే ఎలా ఉంటుందనే అంశపై ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం చేసింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతే చట్ట పరిధిలోకి వస్తుంది. ఆ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన తరువాతనే రాష్ట్రంలో ఆ బిల్లు చట్టరూపంలోకి వస్తుంది.
ఏపిలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కాపులకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏపి అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిని బిల్లు రూపంలోకి తీసుకువచ్చి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. కాపు రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కూడా ప్రభుత్వం కేంద్రానికి పంపిన బిల్లులో కోరింది. అయితే కేంద్రం కాపు రిజర్వేషన్ బిల్లును పక్కన పెట్టి, ఆర్ధికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ ను కల్పించే బిల్లును ఆమోదించింది. ఆర్ధికంగా వెనుక బడిన అగ్రవర్ణ పేదలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్ ను కేటగిరైజేషన్ చేసే అంశంపై న్యాయనిపుణులతో చర్చించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలో కాపు రిజర్వేషన్ ను నాలుగు లేదా ఐదు శాతాన్ని ఇందులో పొందుపరచాలనే అంశాన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చే పది శాతం రిజర్వేషన్లను ఆయా వర్గాలకు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా, ఆయా ‘ సెక్షన్స్ ‘ కి ఇవ్వవచ్చునని బిల్లులో ఉంది. అంటే సెక్షన్ లు అని బిల్లులో పేర్కొనడం వలన ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించవచ్చునని బిల్లు ఉద్దేశమని, జస్టిస్ మంజునాధ కమిషన్ ఇచ్చిన నివేదిక అదే సూచిస్తుందని, సియం వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిపుణులు సూచించారు. ఇలా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించాలంటే ముందు కేంద్రానికి ఏపి ప్రభుత్వం పంపిన బిల్లును వెనక్కి తీసుకోవాలని కూడా న్యాయనిపుణులు సూచించారు. ఎలాగైనా కాపుకోటాను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉంది.